అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా..
రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు
తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది.
మంత్రి తుమ్మల లేఖతో కదలిక?
గతేడాది ఏప్రిల్‌లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment