సూపర్‌బజార్ (కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలోనూ తానే పోటీ చేస్తానని, ఇక్కడి ప్రజల నుంచి తనను ఎవరూ విడదీయలేరని వనమా వెంకటేశ్వరరావు అన్నారు.
కాగా, ఆయన పదవి విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన అనంతరం తొలిసారి గురువారం ఆయన కొత్తగూడెంకు రాగా, జూలూరుపాడు వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పాటు కార్యకర్తలు, ప్రజల అండతో తనకు అంతా మంచే జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం నేటి నుంచే కార్యాచరణకు దిగుతానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని, జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటానని అన్నారు.
ర్యాలీగా సందడి..
ఇక, కొత్తగూడెం వచ్చిన వనామా.. మొదట జూలూరుపాడు సాయిబాబా ఆలయంలో, ఆ తర్వాత సుజాతనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి ప్రధాన సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్ కాలనీ, పోస్టాఫీస్ సెంటర్‌లో వనమాకు క్రేన్‌తో భారీ గజమాల వేశారు. ప్రదర్శనకు ముందు గిిరిజన సంప్రదాయనృత్యాలు, కోలాటాలు అలరించాయి. వనమాకు స్వాగతం పలుకుతూ పలు సెంటర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గణేష్ టెంపుల్ ఏరియాలో అంబులెన్స్ ర్యాలీ మధ్యలో ఇరుక్కోగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ఆ వాహనాన్ని పంపించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి జేవీఎస్ చౌదరి, వనమా తనయులు రాఘవేందర్‌రావు, రామకృష్ణతో పాటు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా
Comments
Please login to add a commentAdd a comment