Jalagam Vengalarao
-
వెంగళరావు తర్వాత మళ్లీ నేనే: భట్టి
మధిర/సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మధిర అభ్యర్థి గా గురువారం ఆయన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ నెల రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశదిశ నిర్దేశించేదిగా ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అనేక పరిశ్రమలు జిల్లాకు సాధించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి అవకాశం జిల్లాకు రానున్నందున అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా అవకాశం లభించగా, మళ్లీ ప్రజల ఆశీస్సులతో తాను ఆ పదవి చేపట్టానని చెప్పారు. రాష్ట్ర సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీదారుడు, దుర్మార్గుడైన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు మెరుగైన భవిష్యత్ ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో ప్రజల అసంతృప్తి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయారని ఎద్దేవా చేశారు. వంద మంది కౌరవుల మాదిరి, శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో.. పాండువుల్లా ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పోరాడానని భట్టి తెలపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి అవినాశ్ వజహర్ ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ చెప్తుంటే బీజేపీ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల ఇళ్లపై ఐటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం సరైంది కాదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతున్నాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. బీఆర్ఎస్ చెపుతుంటే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని, ఐటీ దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టాలని చూడటం అవివేకమేనని భట్టి అభిప్రాయపడ్డారు. -
గుండెల్లో రైళ్లు.. ఎవరికి వాళ్లు ఫిక్స్ అయిపోయారు..!
కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!) ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి. -
ఇక్కడ గెలిస్తే ఢిల్లీలో కీలకం
ఖమ్మం, న్యూస్‌లైన్: హస్తినలో ఖమ్మం స్థానబలం దృఢంగానే ఉంది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎంపీలుగా గెలిచినవారు కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అయితే కేంద్రమంత్రులు..లేదంటే కీలకనేతలుగా వ్యవహరిస్తున్నారు. నాడు లక్ష్మీకాంతమ్మ మొద లు నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇదే ఒరవడి కొనసాగిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీపై ప్రత్యేకమైన చర్చ సాగుతోంది. ఉద్యమాల ఖిల్లా, రాజ కీయ చైతన్యవంతమైనదిగా పేరుతెచ్చుకున్న జిల్లా నుంచి పార్లమెంట్‌కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఏ పార్టీ వారైనా.., ఏ నాయకుడైనా ఖమ్మం ఎంపీ అంటే పార్లమెంట్లో గుర్తింపు పొందిన వారుగా ఉండటం పరిపాటిగా మారింది. ఈ సారి ఎన్నికయ్యే ఎంపీ కూడా ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తారనే చర్చ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులుగా ప్రత్యేక ముద్ర జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా కొనసాగారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలిచిన రంగయ్యనాయుడుకి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. వీరిద్దరితో పాటు జిల్లా నుంచి ఎన్నికైన రేణుకాచౌదరికి కూడా కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడం గమనార్హం. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో కొంతభాగం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. దీనికి తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో పోరిక బలరాంనాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనకు కూడా అనూహ్యంగా కేంద్రమంత్రి వర్గంలో స్థానం దక్కింది. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా ఆయన మన్మోహన్సింగ్ మంత్రి వర్గంలో పనిచేశారు. ఢిల్లీలో ‘కీ’రోల్... ఖమ్మం నుంచి ఎంపీలుగా గెలుపొందిన కొందరు కేంద్రమంత్రులైతే మరికొందరు ఢిల్లీస్థాయిలో కీలకభూమిక పోషిస్తున్నారు. లక్ష్మీకాంతమ్మ, జలగం కొండల్రావు పార్లమెంట్లో తమ వాణిని బలంగా వినిపించారు. సీపీఎం నుంచి ఎన్నికైన తమ్మినేని వీరభద్రం ఆ పార్టీ తరఫున తన మార్కును ప్రదర్శించారు. గత ఎన్నికల్లో గెలుపొందిన నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ పార్లమెంటరీ నేతగా కొనసాగడం విశేషం. అదే దారిలో పొంగులేటి శీనన్న..! లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదేబాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున లోక్‌సభ తొలి అభ్యర్థిగా మార్చి 5వ తేదీన ఖమ్మంలో జరిగిన సభలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘శీనన్నను కేంద్రమంత్రిని చేస్తాను’ అని ప్రకటించడం దీనికి సూచికగా చెబుతున్నారు. -
ప్రజాపోరు
తిరగబడుతున్న ప్రజలు వైఎస్ మరణంతో నిలిచిన అభివృద్ధి అడ్డుపడుతున్న అటవీశాఖ ఓట్ల కోసం రాజకీయ నేతల వల కైకలూరు, న్యూస్‌లైన్ : జలగం వెంగళరావు ప్రభుత్వం 1974లో బలవంతంగా కొల్లేరు ప్రజలతో చేపల చెరువులు తవ్వించింది. ఆరేళ్లకే ఆక్వారంగం అభివృద్ధి చెంది సిరులు కురిపించే అక్షయపాత్రలా మారింది. అక్రమార్కుల కన్ను కొల్లేరుపై పడి లీజుల రూపంలో ఆక్రమణలపర్వం కొనసాగింది. పర్యావరణవేత్తల ఫిర్యాదులతో 1999లో +5 కాంటూరు వరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 77 వేల 131 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించారు. దీని పరిరక్షణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 120 జీవో జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2006లో వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో 31 వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేసింది. వైఎస్ బతికుంటే మరోలా ఉండేది.. కొల్లేరు ఆపరేషన్‌కు కారణ మైన 120 జీవో చంద్రబాబు హయాంలో జారీచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం వివాదానికి కారణమైన సర్కార్ కాల్వ కర్రల వంతెన స్థానంలో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 12 కోట్లు మంజూరు చేశా రు. ఆయన మరణానంతరం అటవీశాఖ ఆంక్షలు, ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి వారధి నిర్మాణం అటకెక్కింది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కోసం రూ. 350 కోట్లను వైఎస్ కేటాయించారు. +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కొల్లేరును కుదించాలనే సాహసోపేతమైన నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి నివేదించారు. జిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాల భూములకు పట్టాలివ్వడానికి 2008లో ప్రయత్నించగా చివరి నిమిషంలో కార్యక్రమం రద్దయింది. జిరాయితీ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ. 625 కోట్లు అందించాలని, రెండు జిల్లాల్లో చేపల చెరువులు కోల్పోయిన రైతులకు +5 కాంటూరు పైన భూమిని సేకరించి పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిని అమలుచేసే సమయంలోనే వైఎస్ మృతిచెందారు. ఓట్ల వేటలో.. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు కొల్లేరుపై దృష్టిసారించారు. కొల్లేటివాసుల ఓట్లను కొల్లగొట్టడానికి గిమ్మిక్కుల పర్వానికి తెరలేపారు. కైకలూరు మండలంలోని ఆటపాక నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక వరకు అభయారణ్యం పరిధిలో ఉండడంతో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. దీనికి ఏలూరు ఎంపీ, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, టీ డీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అడ్డుపడ్డారు. అటవీశాఖ వీరిపై కేసులు సైతం నమోదు చేసింది. గత ఏడాది ఇందిరమ్మ బాట కార్యక్రమానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని చెప్పి కమిటీ వేసి ఊరుకున్నారు. తర్వాత కొల్లేరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, కలవపూడి శివ కొల్లేటి గ్రామాల్లో పాదయాత్రలు చేశారు. ఈ విధంగా అమలు కాని వాగ్దానాలను వల్లిస్తూ వివిధ రాజకీయ పార్టీలు కొల్లేరు ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొల్లేరులో జరిగిన సంఘటనలు... 1971 - రామ్సార్ సదస్సులో కొల్లేరును మంచినీటి సరస్సుగా గుర్తించారు 1976 - చేపల చెరువులను కచ్చితంగా తవ్వాలని 118 జీవో విడుదల 1999 - ఆక్రమిత చెరువుల తొలగింపునకు 120 జీవో విడుదల 2006 - కొల్లేరు ఆపరేషన్‌తో ఆక్రమిత చెరువుల ధ్వంసం 2008 - కొల్లేరును +5 నుంచి +3 కాంటూరు వరకు కుదింపు చేస్తు అసెంబ్లీలో తీర్మానం 2010- కొల్లేరును చిత్తడి నేలల చట్టం పరిధిలో చేర్చడం 2011- రెవెన్యూ శాఖ చేపల చెరువులపై నాలా చట్టం విధింపు 2012- కొల్లేరు సరస్సును ఎకో సెన్సిటివ్ జోన్లో చేర్చడం