ప్రజాపోరు
- తిరగబడుతున్న ప్రజలు
- వైఎస్ మరణంతో నిలిచిన అభివృద్ధి
- అడ్డుపడుతున్న అటవీశాఖ
- ఓట్ల కోసం రాజకీయ నేతల వల
కైకలూరు, న్యూస్‌లైన్ : జలగం వెంగళరావు ప్రభుత్వం 1974లో బలవంతంగా కొల్లేరు ప్రజలతో చేపల చెరువులు తవ్వించింది. ఆరేళ్లకే ఆక్వారంగం అభివృద్ధి చెంది సిరులు కురిపించే అక్షయపాత్రలా మారింది. అక్రమార్కుల కన్ను కొల్లేరుపై పడి లీజుల రూపంలో ఆక్రమణలపర్వం కొనసాగింది.
పర్యావరణవేత్తల ఫిర్యాదులతో 1999లో +5 కాంటూరు వరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 77 వేల 131 ఎకరాలను అభయారణ్యంగా గుర్తించారు. దీని పరిరక్షణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 120 జీవో జారీచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2006లో వైఎస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో 31 వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేసింది.
వైఎస్ బతికుంటే మరోలా ఉండేది..
కొల్లేరు ఆపరేషన్‌కు కారణ మైన 120 జీవో చంద్రబాబు హయాంలో జారీచేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం వివాదానికి కారణమైన సర్కార్ కాల్వ కర్రల వంతెన స్థానంలో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 12 కోట్లు మంజూరు చేశా రు. ఆయన మరణానంతరం అటవీశాఖ ఆంక్షలు, ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి వారధి నిర్మాణం అటకెక్కింది. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ప్రత్యేక పునరావాస ప్యాకేజీ కోసం రూ. 350 కోట్లను వైఎస్ కేటాయించారు. +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కొల్లేరును కుదించాలనే సాహసోపేతమైన నిర్ణయాన్ని అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి నివేదించారు.
జిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాల భూములకు పట్టాలివ్వడానికి 2008లో ప్రయత్నించగా చివరి నిమిషంలో కార్యక్రమం రద్దయింది. జిరాయితీ భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ. 625 కోట్లు అందించాలని, రెండు జిల్లాల్లో చేపల చెరువులు కోల్పోయిన రైతులకు +5 కాంటూరు పైన భూమిని సేకరించి పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిని అమలుచేసే సమయంలోనే వైఎస్ మృతిచెందారు.
ఓట్ల వేటలో.. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు కొల్లేరుపై దృష్టిసారించారు. కొల్లేటివాసుల ఓట్లను కొల్లగొట్టడానికి గిమ్మిక్కుల పర్వానికి తెరలేపారు. కైకలూరు మండలంలోని ఆటపాక నుంచి పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక వరకు అభయారణ్యం పరిధిలో ఉండడంతో రహదారి నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. దీనికి ఏలూరు ఎంపీ, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, టీ డీపీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అడ్డుపడ్డారు. అటవీశాఖ వీరిపై కేసులు సైతం నమోదు చేసింది.
గత ఏడాది ఇందిరమ్మ బాట కార్యక్రమానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో అదనంగా కొట్టేసిన 7.500 ఎకరాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని చెప్పి కమిటీ వేసి ఊరుకున్నారు. తర్వాత కొల్లేరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, కలవపూడి శివ కొల్లేటి గ్రామాల్లో పాదయాత్రలు చేశారు. ఈ విధంగా అమలు కాని వాగ్దానాలను వల్లిస్తూ వివిధ రాజకీయ పార్టీలు కొల్లేరు ప్రజలకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాయి.
కొల్లేరులో జరిగిన సంఘటనలు...
1971 - రామ్‌సార్ సదస్సులో కొల్లేరును మంచినీటి సరస్సుగా గుర్తించారు
1976 - చేపల చెరువులను కచ్చితంగా తవ్వాలని 118 జీవో విడుదల
1999 - ఆక్రమిత చెరువుల తొలగింపునకు 120 జీవో విడుదల
2006 - కొల్లేరు ఆపరేషన్‌తో ఆక్రమిత చెరువుల ధ్వంసం
2008 - కొల్లేరును +5 నుంచి +3 కాంటూరు వరకు కుదింపు చేస్తు అసెంబ్లీలో తీర్మానం
2010- కొల్లేరును చిత్తడి నేలల చట్టం పరిధిలో చేర్చడం
2011- రెవెన్యూ శాఖ చేపల చెరువులపై నాలా చట్టం విధింపు
2012- కొల్లేరు సరస్సును ఎకో సెన్సిటివ్ జోన్‌లో చేర్చడం