హస్తినాపురం: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంస్థను రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఎంప్లాయీస్ యూనియన్ పోరుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సంస్థలో యూనియన్లను పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ హస్తినాపురంలోని కేకే గార్డెన్స్‌లో మంగళవారం జరిగింది.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించాలని, కార్మికులకు బకాయి ఉన్న పేస్కేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విదానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌కు.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ మద్దతు కోరినప్పుడు ఇదే అంశాన్ని స్పష్టం చేశామని, అందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.
కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీతో తమ పార్టీది పేగుబంధమని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే... నిరవధిక దీక్షకు సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వి.ఎస్.బోస్, అధ్యక్షుడు బాబు, నాయకులు కె.రాజిరెడ్డి, పద్మాకర్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment