సాక్షి, హైదరాబాద్: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్‌తో జత కడుతారనే తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకి శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్‌తో మైత్రి కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి వెళ్ళినప్పుడే లబ్ధి పొందామని, విడివిడిగా పోయినప్పుడు నష్టపోయామని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించామని కూనంనేని చెప్పారు.
పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు
‘బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చూసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరింది. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని అనుకుంటున్నారు. మాకు బలంగా ఉన్న చోట ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం’ అని తమ్మినేని పేర్కొన్నారు.
చదవండి: టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే అయ్యేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తహతహ..
కమ్యూనిస్టులు ఉంటేనే కుంభకోణాలు బయటకు..
మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ అడ్డుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంట్‌లను ప్రజలు ఊహించుకోవడం లేదని.. కమ్యూనిస్టులు ఉంటేనే అనేక కుంభకోణాలు బయటకు తీసుకు వస్తారని చెప్పారు.
ఓట్లు సీట్ల కోసం దిగజారం
‘కమ్యూనిస్టుల పద్దతుల్లో మా పోరాటం చేస్తున్నాం. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవు. వ్యక్తిగత దూషణలకే పరిమితం. ఓట్లు సీట్ల కోసం మేము దిగజారం. రోజుకో పార్టీ మారే వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పొత్తులపైన వెంపర్లాడడం లేదు. కేసీఆర్ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తాం. కేసీఆర్ బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని విజ్ఞప్తి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో పొందిక ఉంటుంది. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని కూనంనేని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment