సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు. 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం చెప్పకనే చెప్పేశారు.
కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో నేడు(మంగళవారం) వామపక్షాలు కీలక సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నాయి. సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసినా అన్ని చోట్లా పోటీచేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పోటీ చేయని చోట కమ్యూనిస్టులు ఎవరికి మద్దతిస్తారని ఆసక్తిగా మారింది.మళ్లీ కాంగ్రెస్‌కు చేరువవుతారా దూరంగానే ఉంటారా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: Telangana: చతుర్ముఖ వ్యూహంతో బీజేపీ..
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమను అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఆయనకు కేసీఆర్‌కు అవసరం ఉంది కాబట్టి పిలిచారని.. అక్కడ బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారని, తాము బీఆర్‌ఎస్‌ను నమ్ముకొని లేమని పేర్కొన్నారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేకుంటే ఒంటరిగా పోటీచేస్తామన్నారు.
‘సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయి. పొత్తుపై మేం ఎప్పుడు వెంపర్లాడలేదు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ అడిగింది వాస్తవమే. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతాం. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.
సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని బీఆర్ఎస్ పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు.
కాగా 9 నెలల కింద జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అక్కడ కొంత బలంగా ఉన్న సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య మైత్రి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని అప్పట్లోనే రెండు పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తమ పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో వామపక్షాలు కంగుతిన్నాయి.
పొత్తులో భాగంగా తమ రెండు పార్టీలకు టికెట్లు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు కేసీఆర్ మొండి చేయి చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి దాకా పొత్తులపై చర్చలు జరిపి, తీరా దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటించడంపై మండిపడుతున్నాయి. మునుగోడు తర్వాత కేసీఆర్ మాట తప్పారని, సీఎం అవకాశ వాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ పట్టించుకోకపోవడాన్ని సీపీఐ, సీపీఎం ఏ విధంగా చూస్తాయనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment