అలైదాను సత్కరించి చేగువేరా చిత్రపటాన్ని అందజేస్తున్న హరగోపాల్, వినోద్‌కుమార్, తమ్మినేని, కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ‘మా దేశం పాలు, పాలపొడి సహా ఇతర వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబాను ఆర్థికంగా దిగ్బంధిస్తోంది. అన్ని రంగాల్లోనూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటునే ఉన్నాం. కానీ ఈ ఆర్థిక దిగ్బంధం మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు. చేగువేరా స్ఫూర్తితో, ఫిడేల్ క్యాస్ట్రో చూపిన మార్గంలో విజయం సాధించి తీరుతాం.
గెలిచే వరకు పోరాడాలన్న చేగువేరా పిలుపు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’ అని చేగువేరా తనయ డాక్టర్ అలైదా గువేరా అన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా, ఐప్సో సంస్థలు ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభలో ఆమె ప్రసంగించారు. క్యూబా సార్వభౌమ, స్వతంత్ర దేశమని... ప్రపంచ దేశాల అండ, సంఘీభావంతో తప్పకుండా అమెరికా దుర్నీతిపై విజయం సాధించి తీరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
నేను క్యూబన్ మహిళను...
‘వేలాదిగా తరలివచ్చి ఇలా మీ సంఘీభావాన్ని తెలియజేయడంతో ఎంతో సంతోషంగా ఉంది. రంగు, రూపం వల్ల కాకుండా మనుషులను మనుషులుగా గౌరవించే సమాజం కోసం అందరం సంఘటితం కావాల్సి ఉంది. చేగువేరా కూతురుగా నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. నేను క్యూబన్ మహిళగా ఈ సభల్లో పాల్గొంటున్నాను. చేగువేరా ఒక పరిపూర్ణమైన కమ్యూనిస్టు. సామాజిక సేవను ఆయన నుంచే నేర్చుకున్నాం.
ప్రతి మనిషిలో సామాజిక దృక్పథాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సేవ దోహదంచేస్తుంది. చేసే పని మనిషి గౌరవాన్ని పెంచుతుంది. క్యూబా సామ్యవాద దేశంగా అభివృద్ధి చెందుతోంది. మా వనరులకు, సంపదకు మేమే యజమానులం. మా సామ్యవాద విధానాల వల్లే అమెరికా భయపడుతోంది. రకరకాల ఆంక్షలు విధిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శంకాకూడదనేదే దాని ఉద్దేశం.
కానీ కచ్చితంగా క్యూబా గెలుస్తుంది’ అని అలైదా అన్నారు. ఈ సందర్భంగా క్యూబాకు మద్దతుగా చేసిన తీర్మానాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ గోరటి వెంకన్న పాడిన పాటతో సభ హోరెత్తింది. చేగువేరాపై సుద్దాల ఆంగ్లంలో పాడిన పాట ఆకట్టుకుంది.
ఈ సభలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ఐప్సో ప్రతినిధి యాదవరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఆప్ నేత సుధాకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రజాగాయకుడు గద్దర్, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, అరుణోదయ విమల, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొని క్యూబాకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment