అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ముసలం.. కొత్తగూడెం నాదా? నీదా? | Telangana: Political War For Kothagudem Seat | Sakshi
Sakshi News home page

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ముసలం.. కొత్తగూడెం నాదా? నీదా?

Published Sun, Oct 9 2022 6:30 AM | Last Updated on Sun, Oct 9 2022 2:29 PM

Telangana: Political War For Kothagudem Seat - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్‌ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి గులాబీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టిక్కెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి సీటు తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతుంటే..తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోని సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది.

కారులో కమ్యూనిస్టులు
గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈసారి ఏడాది ముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా పొత్తు కుదిరితే సీపీఐ వారు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, రాష్ట్ర సీపీఐ కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేది అంటూ టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ళు పరుగులు తీస్తున్నాయి.

కర్చీఫ్ వేసేది నేనే.!
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేది తానే అంటున్నారు సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారు. టిక్కెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని ఆశపడినా... అంతిమంగా పోటీ చేసేది తానేనని ఘంటా పథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు వనమా వెంకటేశ్వరరావు. మరో వైపు మాజీ ఎమ్మేల్యే జలగం వెంకట్రావు సైతం టిక్కెట్ మీద  ఆశపలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెప్పుకున్నా...సీపీఐ ఎంత డిమాండ్ చేసినా...చివరి నిమిషంలో తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు.

పోటీకి మాత్రమే ఆశ
ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం వెంకట్రావు... నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రామాలకు మాత్రం హాజరు కావడంలేదు. పైగా సిటింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొనే కార్యక్రమాలవైపేతే కన్నెత్తి కూడా చూడటంలేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిటింగ్‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే..ఈ ఏపిసోడ్ లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్ త్రీలో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

గులాబీ ముట్టుకుంటే ముళ్లేనా?
ఇంకా  మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్‌తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడే సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీ పడుతూ శపథాలు చేస్తుంటే.. నేనూ ఉన్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement