తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు కేసీఆర్. అయితే ఈ పేరు మార్పు వెనుక కచ్చితమైన కారణం ఏంటన్నది చాలా మందికి అంతుపట్టడం లేదు. ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా.. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలో పోటీ చేసినా గెలవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఎంపీ, ఎమ్మెల్యే పదవి కాదు కదా.. ఎంపీటీసీ పదవి అయినా పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోటీ చేస్తే సవాళ్లు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్‌ఎస్ పేరు మార్పు వెనుక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పేరు మార్పు తాంత్రికుడి సూచనే : బండి సంజయ్
కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్‌ఎస్‌గా పేరు మార్చారని బండి సంజయ్ తెలిపారు. బీఆర్‌ఎస్‌కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్‌ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ విమర్శించాడు.
గతంలోనూ పూజలు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ పద్ధతి గతంలో కూడా ఉందని, సచివాలయానికి వెళ్తే ఓటమి తప్పదని చెప్పడంతో అక్కడికి కూడా కేసీఆర్ వెళ్లలేదన్నారు బండి సంజయ్. ఫాంహౌజ్‌లో తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. ఆ అస్తికలను కలపడానికి కాళేశ్వరానికి సకుటుంబ సమేతంగా వెళ్లాడని తప్పుబట్టారు బండి సంజయ్. నల్ల పిల్లితో ఫాంహౌజ్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తాడని, అయితే ఆయన క్షుద్ర పూజలు ఫలించకుండా పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చిందని తెలిపారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌లో గెలవడానికి కూడా క్షుద్ర పూజలు చేశారని.. అయినా అక్కడ ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు మునుగోడులో కూడా అదే పరిస్థితి వస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
కేసులు తప్పించుకోవడానికే పార్టీ మార్పు: రేవంత్
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం ఉన్నట్లు అపోహలు కల్పిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి ఊచలు లెక్కబెట్టిస్తామని బీజేపీ చెబుతోందని.. సీబీఐ, ఈడీ తమను వేధిస్తున్నాయని కేటీఆర్ కూడా చెప్పారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ దోపీడిని ప్రస్తావిస్తున్నారని రేవంత్ అన్నారు. అయితే, అసలు విషయం ఇది కాదని, ఢిల్లీ హైకోర్టులో పూర్తి వివరాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని, 2018లో ఎలక్షన్ కమిషన్‌కు ఢిల్లీ హైకోర్టు అదేశాలిచ్చిందని రేవంత్ తెలిపారు.
కూలీ పేరిట వసూళ్లు..
గతంలో గులాబీ కూలీ పేరుతో నిధులు వసూలు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారని, రాష్ట్రం నలుమూలలా వందలాది కోట్లు వసూలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిధులను వసూలు చేయడం నేరం. అలాంటి వసూళ్లు లంచం తీసుకోవడంతో సమానం. కేంద్ర ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం 20వేల కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవద్దు.
కాగా, గులాబీ కూలీ పేరుతో వసూలు చేసిన నిధుల వివరాలు ఎన్నికల సంఘానికి అందించలేదు కాబట్టి.. టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని రేవంత్ చెప్పారు. విచారణ కోసం సీబీడీటీ చైర్మన్‌కు ఈసీ ఇప్పటికే లేఖ రాసిందని, సరైన చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ రద్దు అవుతుంది కాబట్టే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకుంటున్నారని రేవంత్ వెల్లడించారు. కేవలం కేసుల భయంతో వ్యూహాత్మకంగానే కేసీఆర్ పార్టీ పేరు మారుస్తున్నారని, అంతే తప్ప జాతీయ పార్టీగా ఎదిగే అవకాశమే లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక ఒప్పందం చేసుకున్నారని.. త్వరలోనే ఇది బహిర్గతమయ్యే అవకాశముంది. నలుగురు టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో కలుస్తారని, ఇంకొకరు కలిస్తే రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయినట్టువుతుందని రేవంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment