సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు జోక్యంతో.. రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
వనమా గెలుపును ఆశ్రయిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999,2004లోనూ ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన .. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. ఇక 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా.. ఆపై బీఆర్‌ఎస్‌లో చేరారు. 4,120 ఓట్ల తేడాతో ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్‌పై నెగ్గారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే జలగం వెంకట్రావ్. ఈయన సోదరుడు జలగం ప్రసాద రావు సైతం మాజీ మంత్రి. కాంగ్రెస్ తరపున 2004లో తొలిసారి ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు వెంకట్రావ్. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీ)ఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ టైంలో ఖమ్మం(ఉమ్మడి) నుంచి టీఆర్‌ఎస్(బీఆర్‌ఎస్) తరపున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే.
Comments
Please login to add a commentAdd a comment