సంపూర్ణ భారత దేశ యాత్రకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7 నుంచి యాత్ర మొదలవుతుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరిగే యాత్ర తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో సాగుతుంది. తెలంగాణలో రాహుల్ యాత్రకు టీపీసీసీ చేస్తున్న ప్లాన్ ఏంటి? ఏ జిల్లాల్లో రాహుల్ యాత్ర జరగబోతోంది?
దేశంలో రోజు రోజుకు పతనమవుతున్న కాంగ్రెస్‌కు ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరుతో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ తిష్ట వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. గ్రూప్ 23లోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పతనాన్ని నిరోధించడానికి, తిరిగి ప్రాణం పోయడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా పాదయాత్ర చేయబోతున్నారు.
సెప్టెంబర్ 7 నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్ర...దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాలు , 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగనుంది. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి తన పాదయాత్ర ఉపయోగపడుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్న తరుణంలోనే రాహుల్ చేయబోతున్న పాదయాత్ర పార్టీ పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 150 రోజుల పాటు 3570 కిలోమీటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర సాగుతుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్ లో రాహుల్ పాదయాత్ర ముగుస్తుంది.
తెలంగాణలో..
రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో అక్టోబర్ రెండో వారంలో ఎంటరవుతుందని భావిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణ లోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటరవుతుంది. తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ లో 13 రోజుల పాటు 326 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. మక్తల్ లో తెలంగాణలోకి ఎంటరై, మదూర్ ద్వారా రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది.
ఇప్పటికే ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం రాహుల్ గాంధీ పాదయాత్ర మక్తల్ , నారాయణ పేట్ , కొడంగల్ , పరిగి , వికారాబాద్ , సదాశివ పేట్ , మదూర్ మీదుగా మహారాష్ట్ర లోకి ఎంటరవుతుంది. ఇందులో మొత్తం 4 పార్లమెంట్ , 9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. అయితే తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేయాలని ఇప్పటికే టీ పీసీసీ భారత్ జోడో యాత్ర కమిటీని కోరింది.
ప్రస్తుత రూట్ మ్యాప్ ప్రకారం తెలంగాణ బార్డర్ లో ఈ రాహుల్ యాత్ర ఉండడంతో పార్టీకి పెద్దగా ఉపయోగం లేదని..యాత్రను తెలంగాణ మధ్య నుండి వెళ్ళేలా రూట్ మ్యాప్ తయారు చేయాలని కోరుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ , వికారాబాద్, చేవెళ్ల , జహీరాబాద్ ముదోల్ మీదుగా పాదయాత్ర రూట్ తయారు చేయాలని కోరుతున్నారు. కనీసం 7 పార్లమెంట్ , 15 అసెంబ్లీ సెగ్మెంట్ ల మీదుగా పాదయాత్ర సాగేలా చూడాలని హై కమాండ్‌ను కోరింది టీ కాంగ్రెస్. అలా అయితే తెలంగాణ లో అన్ని జిల్లాల్లో పార్టీకి మంచి బూస్టింగ్ వస్తుందని ఆశిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు.
మూడు బహిరంగ సభలు..
రాహుల్ పాదయాత్రలో కనీసం 3 భారీ బహిరంగ సభలు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణకు పాదయాత్ర ఎంటర్ అయినప్పుడు ఒక సభ ..మధ్యలో ఒక సభ, రాష్ట్రంలో పాదయాత్ర ముగింపునకు ఓ సభ నిర్వహించాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. అంతేకాకుండా పాదయాత్ర జరిగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తెలంగాణ నుంచి ఇంఛార్జ్ గా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను నియమించారు.
రాహుల్ గాంధీ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ఈ పాదయాత్ర ద్వారా అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ప్రజలు ‘కేసీఆర్ ముక్త్ తెలంగాణ’ కోరుకుంటున్నారు: తరుణ్‌ఛుగ్
Comments
Please login to add a commentAdd a comment