
తమ ప్రమేయం లేకుండానే తగులుతున్న ఎదురుదెబ్బలను అడ్డుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ.. పట్టు నిలుపుకోవడం కోసం ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటంతో.. తమ ప్రమేయం లేకుండానే తగులుతున్న ఎదురుదెబ్బలను అడ్డుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో తామూ చురుగ్గానే ఉన్నామని చెప్పుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక మొదలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం నుంచి బయటపడటంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ అవగాహన ఉందని, బెంగాల్ తరహా పరిస్థితులను సృష్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న రాజకీయ ఆటకు చెక్‌పెట్టడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
చేతులు కాలకముందే..!
రాష్ట్రంలో కేవలం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్యే పోటీ ఉందనే భావన నుంచి ప్రజల దృష్టి మరల్చాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలపై పోరాడి ఆకర్షించాలని.. ఇదే సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఉన్న అవగాహనను ఎండగట్టాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. చేతులు పూర్తిగా కాలకముందే.. సగం కాలిన చేతులతో అయినా ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చేతులు పూర్తిగా కాలిపోతాయా? బాగవుతాయయా అన్నది వేచి చూడాలి..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏం చేస్తే బాగుంటుంది?
బీజేపీ, టీఆర్‌ఎస్‌ల దూకుడును దీటుగా ఎదుర్కోవడం, సమస్యలపై ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)శనివారం జూమ్ యాప్ ద్వారా సమావేశమైంది. అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇద్దరూ కిసాన్‌సెల్ నేతలతో సమావేశమై రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సాయంత్రం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో.. రేవంత్‌రెడ్డి, భట్టితోపాటు ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, బోసురాజు, నదీమ్ జావేద్, చిన్నారెడ్డి, షబ్బీర్‌అలీ, కోదండరెడ్డి, మల్లురవి, జి.నిరంజన్, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రేవంత్, భట్టి వివరించారు. అనంతరం ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణ గురించి నేతలు చర్చించారు. తొలిదశలో భాగంగా రైతులు, ఓబీసీ సమస్యలను చేపట్టాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేయాలని, ఓబీసీల జనగణన అంశం, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు అంశాలపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.
కాంగ్రెస్ కార్యాచరణ ఇదీ..
రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రైతు రుణమాఫీతోపాటు ధరణి సమస్యల పరిష్కారం, ఏపీలో జరుగుతున్న తరహా కార్యక్రమాల అమలు కోసం 21న సీఎస్‌ను కలవాలని తీర్మానించారు. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించనున్నారు.
► రైతు సమస్యలపై.. ఈ నెల 24న మండలాలు, 30న నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
► డిసెంబర్ 5న జిల్లాస్థాయిలో ఆందోళనలు చేపట్టాలని.. స్థానికంగా ఉన్న మహా నాయకుల విగ్రహాల వద్ద నుంచి కలెక్టరేట్ల వరకు భారీ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ ఆందోళనల్లో రాష్ట్రస్థాయి నాయకత్వం పాల్గొనాలని నిర్ణయించారు.
► ఇతర వర్గాలకు చెందిన సమస్యలు, తదుపరి కార్యాచరణపై మరోమారు సమావేశం కావాలని జూమ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: Bengal Style Politics: తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం!