
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ రెండో చార్జిషీట్ వేసింది. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా రెండు నెలలపాటు ప్రతివారం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్లు వేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా వైద్యరంగంపై చార్జిషీట్ వేసింది. శనివారం గాంధీభవన్‌లో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 16 అంశాలతో కూడిన అభియోగ పత్రాన్ని విడుదల చేశారు.
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం కుదేలైందని, మండలస్థాయిలో 30 పడకల దవాఖానా ఏర్పాటు హామీ, డాక్టర్లు ఊర్లోనే నివసించాలన్న నిబంధన ఎత్తివేత, బడ్జెట్‌లో 4.4 శాతం మాత్రమే నిధుల కేటాయింపు, ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులలేమి, సిబ్బంది కొరత, రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్న వైనం, జిల్లాకేంద్రాల్లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయకపోవడం, అత్యవసర సేవల నిర్వీర్యం, సమగ్ర వైద్య విధానం రూపకల్పనలో వైఫల్యం, పల్లెల్లో అరకొర వైద్యం, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల హెల్త్‌కార్డుల సేవలకు ఆటంకాలు, కరోనా కట్టడిలో విఫలం, కరోనా బూచితో కార్పొరేట్లకు దోచిపెట్టడం, గ్రేటర్ హైదరాబాద్‌లో పడకేసిన వైద్యం అనే అంశాలతో ఈ అభియోగపత్రాన్ని రూపొందించింది.
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు: ఏలేటి
కొత్త సచివాలయం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్‌ల మీద ఉన్న ప్రేమ సీఎం కేసీఆర్‌కు ప్రజారోగ్యంపై ఎందుకు లేదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆరోగ్య తెలంగాణ చేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ బడ్జెట్‌లో 8 శాతం మేర కేటాయించాల్సిన నిధులను కేవలం 4.4 శాతానికి పరిమితం చేశారన్నారు. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కోల్పోయేలా చేశారని, ముఖ్యమంత్రి తన సాధారణ పరీక్షలకు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం ఆయనకే చెల్లిందన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్వాయి స్రవంతి, నిరంజన్, మదన్‌మోహన్, కైలాశ్, భరత్‌చౌహాన్ పాల్గొన్నారు.
చదవండి: 'కమలం'లో కలకలం.. కోవర్టులపై అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment