పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు
మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దపూర్ శివారులోని హోటల్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలోని తన స్నేహితులు, బంధువుల నుంచి అందిన సమాచారం మేరకు జగన్ మళ్లీ సీఎం అవుతారని, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు.
బీఆర్‌ఎస్ గల్లంతు..
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రాదని, జూన్ 4న ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో నిజామాబాద్‌తో పాటు కాంగ్రెస్ 13 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవితను గెలిపిస్తే లిక్కర్ దందాతో ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ఎలాంటి వివాదం లేదని, దీనిపై పనిలేని వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు వెళ్తారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment