సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గతంలో పార్టీని వీడి వెళ్లిన నేతలను.. తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ మేరకు చేరికల కోసం స్వయంగా ఆయనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు బీజేపీని గట్టి దెబ్బ కొట్టాలనే ఆలోచన చేసినట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణలో ఇప్పటికే పలువురు నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది టీఆర్‌ఎస్. స్వయంగా ఉద్యమ నేతలకు కేసీఆరే ఆహ్వానం అందించినట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్ చేరిక ఖరారుకాగా.. స్వామిగౌడ్, జితేందర్‌రెడ్డిలో సైతం టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. వీళ్లతో పాటు నాటి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలందరికీ తిరిగి పార్టీలోకి ఆహ్వానం అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ మేరకు ఉద్యమ నేతల్లో కొందరికి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అంతేకాదు.. వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామిగౌడ్ చేరిక దాదాపు ఖాయమైందని టీఆర్‌ఎస్ శ్రేణులు చెప్తుండగా.. జితేందర్‌రెడ్డితో చర్చల కోసం నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక పార్టీని వీడిన వాళ్లను తిరిగి ఆహ్వానించడం ద్వారా.. బీజేపీ వలస రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థులకు వ్యూహాలను దెబ్బ కొట్టవచ్చని గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ రచించినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment