సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర సర్వే నివేదికలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు అందాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకమని భావిస్తున్న కేసీఆర్ తనకు అందిన నివేదికలను పోస్ట్‌మార్టం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత శాసనసభ్యులతో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి ఆర్థిక స్థితిగతులు, వారి రాజకీయ నేపథ్యం తదితర అంశాలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ‘ఐ ప్యాక్’బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఓ వైపు ఎమ్మెల్యేల పనితీరును సానుకూల కోణంలో విశ్లేషిస్తూనే, మరోవైపు వారిలో ఉన్న లోపాలను ఈ నివేదికలు ఎత్తి చూపినట్లు సమాచారం. వీటితో పాటు వివిధ సర్వే సంస్థల నుంచి అందిన నివేదికల్లోని అంశాలను క్రోడీకరించి తుది నివేదికలు రూపొందించినట్లు తెలిసింది.
వెలుగులోకి విస్తుగొలిపే అంశాలు
పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఈ నివేదికల్లో విస్తు గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల దందాలు, అవినీతి, బంధు ప్రీతి, వారు నెరపుతున్న ఇతర సంబంధాలు తదితరాలను ఈ నివేదికలు కుండబద్ధలు కొట్టినట్లు వెల్లడించాయి. ఎమ్మెల్యేలు పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకపోవడం, కొందరినే దగ్గరకు తీయడం, అభివృద్ధి పనుల్లో వాటాల వసూలు, భూ సెటిల్‌మెంట్లు, ఇసుక దందాలు, కుటుంబసభ్యుల ద్వారా బెదిరింపులు, వసూళ్లు వంటి అనేక అంశాలను ఎత్తి చూపాయి.
వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలు ‘ఓ మోస్తరు’గా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేయగా, కొద్ది మందికి మాత్రమే గెలుపు ‘సుస్పష్టం’అని వెల్లడించాయి. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని సిఫారసు చేయకున్నా పార్టీలోనే మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్లు నివేదికలు సూచించినట్లు సమాచారం. ఇక ఒకరిద్దరు మినహా మిగతా అందరు మంత్రుల పనితీరు మెరుగ్గానే ఉన్నట్లు నివేదికల్లో వెల్లడైనట్లు సమాచారం.
తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు
పార్టీలో ఉన్న గ్రూపులు, ఆ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న వారు, అంతర్గత విభేదాలతో జరిగే నష్టం వంటి వివరాలతో పాటు వాటి నివారణకు పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న ప్రధాన అభ్యర్థులు, టీఆర్‌ఎస్ అభ్యర్థి నడవడిక సరిగా లేని పక్షంలో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అనే అంశాలతో పాటు వారి బలబలాలను నివేదికలు క్షుణ్ణంగా విశ్లేషించాయి.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఐదుగురు బలమైన నేతలు, వారు ఎన్ని వేల ఓట్లను ప్రభావితం చేయగలరు వంటి అంశాలను కూడా స్థూలంగా నివేదికల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. గుర్తింపు దక్కని పక్షంలో పార్టీని వీడే యోచనలో ఉన్న నేతలు, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చే అవకాశమున్న నాయకుల జాబితాలను పొందుపరిచినట్లు సమాచారం.
హెచ్చరికలు.. దిద్దుబాట్లు
తనకు అందిన నివేదికల ఆధారంగా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు పనితీరును మార్చుకోవాలంటూ ఇప్పటికే అంతర్గతంగా సంకేతాలు ఇవ్వడంతో పాటు దిద్దుబాటు చర్యలకు కూడా పూనుకున్నట్లు తెలిసింది. అంతర్గత విభేదాల పరిష్కారం, కొద్దిగా తీరు మార్చుకుంటే విజయావకాశాలు మెరుగయ్యే పరిస్థితులు ఉన్న చోట దిద్దుబాటు బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు కొందరు జిల్లా మంత్రులకు అప్పగించినట్లు తెలిసింది.
వ్యక్తిగత, ఆస్తిపాస్తుల వివరాలూ..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్, బీజేపీ తరఫున టికెట్ ఆశించే నేతల వ్యక్తిగత వివరాలు, వారి కుటుంబసభ్యులు ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా అనే కోణంలో కూడా నివేదికలు తయారైనట్లు తెలిసింది. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌తో పాటు ఇతర కొన్ని నియోజకవర్గాల్లో బీఎస్‌పీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే కోణంలోనూ అధ్యయన బృందాలు అంచనా వేశాయి. నేతలు ఎంతమేర ఆర్థికస్తోమత కలిగి ఉన్నారు? వారి ఆదాయ మార్గాలేంటి? ఏ తరహా వ్యాపార, వాణిజ్య సంస్థలు నిర్వహిస్తున్నారు? వారికి అనుకూలంగా, ప్రతికూలంగా పనిచేసే అంశాలు, గెలుపు అవకాశాలు తదితరాలపై సర్వే సంస్థలు లోతుగా అధ్యయనం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment