ఎక్కడా తగ్గని రేవంత్‌రెడ్డి.. ఇక కొత్తగా కాంగ్రెస్‌! | Key Positions For Political Leaders In Telangana Congress | Sakshi
Sakshi News home page

ఎక్కడా తగ్గని రేవంత్‌రెడ్డి.. ఇక కొత్తగా కాంగ్రెస్‌!

Published Sun, Dec 11 2022 12:42 AM | Last Updated on Sun, Dec 11 2022 12:42 AM

Key Positions For Political Leaders In Telangana Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీఏసీని మార్చారు.. కొత్తగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటు చేశారు.. 24 మంది ఉపాధ్యక్షులను నియమించారు.. సీనియర్‌ ఉపాధ్యక్షులను కొనసాగిస్తున్నారో లేదోననే స్పష్టత లేకుండానే వారిలో కొందరిని ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో నియమించారు. ఏకంగా 84 మందికి ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టారు. ఆరు జిల్లాల అధ్యక్షులను మార్చారు. పాత డీసీసీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. మొత్తంగా ఏఐసీసీ తెలంగాణ పీసీసీని జంబ్లింగ్‌ చేసి జంబో కమిటీలను నియమించింది. శనివారం విడుదల చేసిన పీఏసీ, పీఈసీ, పీసీసీ కమిటీల్లో మొత్తం 170 మందికి స్థానం కల్పించడం విశేషం. వీరికి తోడు టీపీసీసీ కార్యదర్శులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శుల జాబితా ఇంకా రావాల్సి ఉంది.

కీలకమైన పీఏసీలో మార్పులు
రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో మార్పులు జరిగా­యి. గతంలో 14 మంది సభ్యులతోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ నియమించిన కమిటీల చైర్మన్లు, ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పుడు సభ్యుల సంఖ్యను 18కి పెంచారు. అదనంగా నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్కలను తొలగించారు.

ఏఐసీసీ నియమించిన కమిటీల చైర్మన్లలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పీఏసీ సభ్యుడిగా తీసుకోలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంట్ల జాబితా నుంచి గీతారెడ్డిని తొలగించి 18 మంది సభ్యుల జాబితాలో చేర్చారు. నలుగురు ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీ, సంపత్‌లను కూడా అదే జాబితాలో చేర్చారు. ఇక ఇన్‌చార్జి కార్యదర్శుల పేర్లు కొత్తగా నియమించిన కమిటీలో లేవు. ఈ కమిటీకి చైర్మన్‌గా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ను కొనసాగించగా గతంలో షబ్బీర్‌అలీకి ఇచ్చిన కన్వీనర్‌ హోదాను తొలగించారు.

కొత్తగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ
40 మందితో కొత్తగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పీఏసీలోని 21 మందికి అదనంగా మరో 19మందిని దీనిలో నియమించారు. టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలను దీనిలో నియమించారు. కొండా సురేఖ, వినోద్, ఈరవత్రి అనిల్‌లలో ఒకరిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని భావించినా.. ఆ ముగ్గురినీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోకి తీసుకున్నారు.

కొత్తవారికి డీసీసీలు
డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్‌ కొత్త వారికి అవకాశం కల్పించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ అవతల 24 మందిని జిల్లా అధ్యక్షులను ప్రకటించగా.. గ్రేటర్‌ కమిటీలో కొత్తగా ఖైరతాబాద్, హైదరాబాద్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. సికింద్రాబాద్‌తోపాటు సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, జనగామ, భూపాలపల్లి జిల్లాలను పెండింగ్‌లో పెట్టారు. ఆయా చోట్ల కొత్తగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడం, ఇప్పుడున్నవారికి ఏం పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు తెగకపోవడంతో పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.

ఎంపీ కోమటిరెడ్డి పేరెక్కడ?
ఏఐసీసీ తాజాగా నియామకాల్లో ఎక్కడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కనిపించలేదు. గతంలో ఉన్న పీఏసీ సభ్యుడి హోదాను తొలగించడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీలోనూ ఆయన పేరు చేర్చలేదు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో వెంకటరెడ్డిని పక్కన పెట్టారనే చర్చ జరుగుతోంది.

ఎక్కడా తగ్గని రేవంత్‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గంగా గుర్తింపు పొందినవారికి సీనియారిటీతో సంబంధం లేకుండా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులు రావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్‌కు ఉపాధ్యక్షుడిగా.. ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నేతలు మానవతారాయ్, చరణ్‌కౌశిక్‌ యాదవ్, చారుకొండ వెంకటేశ్, దుర్గం భాస్కర్, బాలలక్షి్మలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా చాన్స్‌ ఇచ్చారు.

ఆదివాసీ ఉద్యమ నాయకుడు వెడమ బొజ్జు, సామాజిక సమావేశాలు పెట్టిన దయాకర్, గోమాస శ్రీనివాస్‌లకు.. గత ఎన్నికల్లో మునుగోడు టికెట్‌ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డికి ప్రధాన కార్యదర్శి పదవులిచ్చారు. ఎంపీ వెంకటరెడ్డితో మొదటి నుంచీ విభేదించిన మహబూబ్‌నగర్‌ నేత ఎర్ర శేఖర్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చారు. పీజేఆర్‌ కుమార్తె, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ విజయారెడ్డి, బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాతం నర్సింహారెడ్డి, జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డిలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డికి పదోన్నతి కల్పించి ఉపాధ్యక్షుడి హోదాలో నియమించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement