గన్‌పార్క్ అమరులస్తూపం వద్ద పుష్పాంజలి
అక్కడి నుంచి అమరజ్యోతి వరకు బీఆర్‌ఎస్ కొవ్వొత్తుల ర్యాలీ
నేడు తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
జాతీయ జెండా ఎగురవేయనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో.. తొలిరోజున సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి అమరులకు నివాళి అర్పించారు.
అనంతరం అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని కేసీఆర్ ప్రారంభించారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది.
అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. రవీంద్రభారతి, ఆర్‌బీఐ మీదుగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహారులు.. వీరులకు జోహారులు’అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అందరూ అమరులకు నివాళి అర్పించారు.
నేడు తెలంగాణ భవన్‌లో వేడుకలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9.30కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాతోపాటు బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు.
అనంతరం ‘తెలంగాణ యాది’పేరిట ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. తర్వాత తెలంగాణ భవన్ పక్కనే ఉన్న కళింగ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారు.
ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ: కేసీఆర్
ప్రజాస్వామిక వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో బీఆర్‌ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పర్చుకుంటూ సమర్థవంతంగా పాలన అందించిన గత పదేళ్లలో.. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అమరుల త్యాగాలను వృధాపోనీయకుండా.. గత పదేళ్ల ప్రగతిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment