PM Modi's visit to Hyderabad raises political heat in Telangana - Sakshi
Sakshi News home page

PM Modi: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం 

Published Sat, Apr 8 2023 1:50 AM | Last Updated on Sat, Apr 8 2023 10:28 AM

PM Narendra Modi Hyderabad Visit Political Heat In Telangana BJP BRS - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌:  ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. పలు రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఎయిమ్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడి కార్యక్రమాల తర్వాత పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో పాల్గొంటారు. కొంతకాలం నుంచి బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరడం, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితను ఈడీ విచారించడం, పదో తరగతి పేపర్‌ లీక్‌ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన కాక రేపుతోంది.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నిరసనలకు పిలుపునివ్వడం, మోదీని, బీజేపీని టార్గెట్‌ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు పెట్టడం, సింగరేణి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించడం అగి్నకి ఆజ్యం పోస్తోంది. ఇక ‘పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు? రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలేమైనా చేస్తారా? కేవలం కేంద్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రానికి ఇచి్చన నిధులు, సాయం వంటి అంశాలకే పరిమితమవుతారా?’ అన్నదానిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ పారీ్టలు కూడా నిరసనలు చేపట్టాలని నిర్ణయించాయి. 

ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ 
తెలంగాణకు సంబంధించి రూ.11 వేల కోట్ల పైచిలుకు విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మోదీ వస్తున్నందున రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా, లేదా అన్న చర్చ సాగుతోంది. గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ.. కొన్నిసార్లు కేసీఆర్‌ను, రాష్ట్రసర్కార్‌ను ఉద్దేశించి నేరుగా.. మరికొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు సంధించారు. మరి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై, సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిపై ఘాటైన విమర్శలు చేస్తారా, లేక గతంలో తరహాలో పరోక్ష విమర్శలు చేస్తారా? బండి సంజయ్‌ అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించి తప్పుపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఎన్నికల ‘ఎఫెక్ట్‌’ ఉంటుందంటున్న బీజేపీ! 
కొన్నినెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మోదీ సభలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర సర్కారు, బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేయడం వంటివి చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో టీఎస్‌పీఎస్సీ, టెన్త్‌ పేపర్ల లీకేజీ, సంజయ్‌ అరెస్ట్, మళ్లీ సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తేవడం, ఢిల్లీ లిక్కర్‌స్కాంలో కవితను ఈడీ విచారించడం వంటి అంశాలను ప్రధాని మోదీ పరోక్షంగానైనా ప్రస్తావించి... తద్వారా బీఆర్‌ఎస్‌ పెద్దలకు, రాష్ట్ర బీజేపీకి తగిన సంకేతాలు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబ పారీ్టలు, రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా విమర్శించే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. 

బీజేపీ–బీఆర్‌ఎస్‌.. టగ్‌ ఆఫ్‌ వార్‌.. 
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్‌ఎస్, బీజేపీ దూకుడు పెంచాయి. దీనితో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ, ఢిల్లీ లిక్కర్‌ స్కాం అంశాలపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీఆర్‌ఎస్‌ సర్కారును, కేసీఆర్‌ కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌ కూడా దీటుగా స్పందించి ప్రత్యారోపణలకు దిగింది. పదో తరగతి పేపర్ల లీక్‌ కేసులో కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు, రిమాండ్‌తో వేడి పెరిగిపోయింది. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి అటు కేంద్రాన్ని, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. పార్టీ శ్రేణుల్లో దూకుడు పెంచేందుకు కేసీఆర్‌ సహా కీలక నేతలంతా ప్రయతి్నస్తున్నారు. ఇక ప్రధాని పర్యటనను, సభను విజయవంతం చేసి.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. 

ఈసారీ కేసీఆర్‌ దూరమే! 
దాదాపు ఏడాదిన్నర కాలంలో వివిధ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ నాలుగుసార్లు రాష్ట్రానికి రాగా.. సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆయన కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ఐదోసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం సీఎంకు ఆహా్వనం పంపడంతోపాటు బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించారు. కానీ ఈసారి కూడా ప్రధాని కార్యక్రమాలు, సభలో కేసీఆర్‌ పాల్గొనడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను పంపిస్తున్నారు. 

మోదీ పర్యటన కార్యక్రమాలు ఇవీ.. 
ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు.. 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు.. 
11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు. 
11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు. 
మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 
12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు 
12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం... 
12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన. 
12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం 
1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం  

రాక..
► సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్న మోదీ 
► సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం 
► ఎంఎంటీఎస్‌ సరీ్వసుల ప్రారంభం.. మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ జాతికి అంకితం ..బీబీనగర్‌ ఎయిమ్స్‌లోపలు పనులకు భూమి పూజ 
► పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు 
► పరేడ్‌గ్రౌండ్స్‌ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగం 

కాక..
► రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు 
► ప్రధాని మోదీ, బీజేపీని టార్గెట్‌ చేస్తూ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు..
► సింగరేణి ప్రాంతాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన
► మోదీ సహా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలపై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు 
► తామూ నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్, వామపక్షాల నిర్ణయం
చదవండి: మోదీ పర్యటన వేళ.. బీఆర్‌ఎస్‌ సరికొత్త ప్రచార అస్త్రం.. ‘ఇదే ఆహ్వానం..’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement