తల్లాడ: దేశంలో ఇంకో మతం ఉండొద్దనే దుష్ట ఆలోచనతో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆజాదీకా గౌరవ్ పేరుతో ఖమ్మం జిల్లాలో ఆయన చేపట్టిన 75 కి.మీ. పాదయాత్ర ఐదో రోజైన శనివారం తల్లాడ, కల్లూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భట్టి మాట్లాడారు. లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ.. హిందూ మతం తప్ప మరొకటి ఉండకూడదని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన కుట్రలను తిప్పకొట్టడానికే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాయ మాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తూ ప్రజలను బహుళజాతి సంస్థల వద్ద తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. మరోపక్క ఆహార వస్తువులు, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. యాత్రలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: తెలంగాణపై పూర్తి పేటెంట్ టీఆర్‌ఎస్‌దే..
Comments
Please login to add a commentAdd a comment