తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ బాస్నే ఢీకొడుతున్నారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? జిల్లాలో పొంగులేటికి కౌంటర్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖమ్మం జిల్లాలోని పది సీట్లను గెలుచుకునే విధంగా కేసీఆర్ ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు?
గులాబీ పార్టీకి కొరుకుడు పడని జిల్లా ఉమ్మడి ఖమ్మం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటిలో చేర్చుకుని తమ బలం పెరిగిందని అధికార పార్టీ భావించింది. గత ఎన్నికల్లో ఎంపీ సీటు దక్కని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉంటూ.. గులాబీ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. చివరికి పార్టీ నుంచి సస్పెండయ్యారు.
ప్రస్తుతం ఏ పార్టీకి అనుబంధంగా లేని పొంగులేటి త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరతారు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను పోటీ పెట్టడానికి సైతం పొంగులేటి ప్లాన్ చేశారు. తాను ఏ పార్టీలో చేరినా వారికి టిక్కెట్ ఇప్పించేవిధంగా హామీ ఇచ్చారు. జిల్లాలో పునాదులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, పోయిన బలాన్ని కూడదీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు పొంగులేటితో మంతనాలు జరుపుతున్నాయి. మే మొదటివారంలో పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున ఒక్క ఎమ్మేల్యేను కూడ గెలవనివ్వనంటూ పొంగులేటి చేసిన శపథం అధికార పార్టీలో మంటలు రేపింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం ఈ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఒక మాజీ ఎంపీ నేరుగా సీఎంనే ఢీకొడుతుంటే ఆ పార్టీ కామ్గా ఉంటుందా? పొంగులేటిపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ఎటాక్ చేయాలని గులాబీ దళానికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి మీద విమర్శలు సంధించడం ఆరంభించారు కూడా. అదేవిధంగా మే నెలలో పొంగులేటి ఏదో ఒక పార్టీలో చేరతారు గనుక.. అదే నెలలో ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
(చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?)
గత రెండు ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా పదికి పది నియోజకవర్గాలు తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే కేసీఆర్ కూడా ఈ జిల్లాపై పూర్తి స్తాయిలో ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఒకవేళ కాంగ్రెస్లో చేరితే జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి...ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఎటువంటి పరిస్తితులనైనా ఎదుర్కొని జిల్లాను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ వేస్తున్నారు. పార్టీ చేయించిన సర్వేల్లో ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలను ఈసారి మార్చివేసి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో మార్పులు తప్పవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏ పార్టీలో చేరే విషయాన్ని మే నెలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించబోతున్నారు. ఇక అప్పటి నుంచే ఖమ్మం జిల్లా పొలిటికల్ ఈక్వేషన్స్‌లో మార్పులు రావడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొంగులేటి ప్రకటన తర్వాత అసలు గేమ్ మొదలు కాబోతోంది.
చదవండి: ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్.. హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంటుందా?
Comments
Please login to add a commentAdd a comment