రామన్నపేటలో బండి సంజయ్‌కు రాఖీ కడుతున్న ముస్లిం మహిళ
సాక్షి, యాదాద్రి/హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యముంటే టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. 9వ రోజు ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా ఆయన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చేరు కున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘మీరు రాముడి వారసులైతే బీజేపీకీ ఓటేయాలి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు అధికా రం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి’ అని కోరారు.
కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కేసీఆర్ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 200 కి.మీ. దూరంలో ఉన్న తన ఫాంహౌస్ నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కనీసం రూ.700 కోట్లు వెచ్చించలేకపోతున్నారని విమర్శించారు. నిధుల్లేకనే ధర్మారెడ్డిపల్లె, బునాదిగాని, పిలాయిపల్లి కాలువలు పూర్తి కావడంలేదని అన్నారు.
కేసీఆర్‌కు వయసు మీదపడి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. రామన్నపేటలో రైళ్లు నిలిచేవిధంగా కేంద్రంతో మాట్లాడతానని ఆయన స్థానికులకు హామీనిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయని అన్నారు. సంజయ్ 9వ రోజు 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
చదవండి: కేంద్ర ఆర్థిక దిగ్బంధాన్ని ఎండగడదాం!
Comments
Please login to add a commentAdd a comment