తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్‌ను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలు ఇంఛార్జ్‌లను పెట్టుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర ఇంఛార్జ్‌లు ఏం చేస్తున్నారు? వారి వ్యూహాలు తెలంగాణలో వర్కవుట్ అవుతాయా?..
జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్ లను నియమించుకుని తమ ప్రణాళికలను అమలు చేస్తుంటాయి. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఇంఛార్జ్ లను పెట్టుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్ గా మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు ఠాక్రే వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి తెలంగాణ వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నలుగురు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు శివప్రకాశ్, సునీల్ బన్సాల్ తో పాటు పొలిటికల్ ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్, సహ ఇంఛార్జ్ గా అరవింద్ మీనన్ పనిచేస్తున్నారు. పార్టీలో అన్నీ తామై ముందుకు నడపాల్సిన బాధ్యత ఇంఛార్జ్ లపై ఉంటుంది. రాజకీయ క్షేత్రంలో నేతలను సమన్వయం చేయడం కష్టసాధ్యమైన పని. కాంట్రావర్సీల జోలికి వెళ్లకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ.. కార్యక్రమాలను రూపొందించడం.. పార్టీ నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ల కర్తవ్యం.
తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్‌ల తీరు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటా అన్నట్లుగా ఉందని సొంత పార్టీలోనే నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసమ్మతి నేతలు తరుచూ భేటీ అవుతున్నారు. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం సాధించే పనిని వదిలేసి.. ఇంఛార్జ్ లుగా పెత్తనం చేస్తున్నారని మండిపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పలువురు నేతలకు పొసగడం లేదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా.. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ లు ఇప్పటి వరకు సర్ధుబాటు చేయలేదని అసమ్మతి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూపీ లాంటి పెద్దరాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా పనిచేసి వచ్చిన సంస్థాగత ఇంఛార్జ్ సునీల్ బన్సల్ చేస్తున్న ప్రయోగాలు తెలంగాణ నేతలు ఒంటపట్టించుకోవడం లేదట. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తికరణ్ లాంటి కార్యక్రమాలతో తొలుత హడావిడి చేసినా.. తర్వాత స్థానిక నేతల తీరుతో బన్సల్ విసిగిపోయారట. పొలిటికల్ ఇంఛార్జ్ గా ఉన్న తరుణ్ చుగ్ తెలంగాణకు రావడమే తగ్గించారు. నేతల మధ్య సమన్వయం కోసం ఎలాంటి వర్క్ అవుట్స్ చేయకపోవడం బీజేపీకి పెద్దమైనస్ గా మారిందని చెప్పవచ్చు.
కర్ణాటక ఎన్నికల విజయంతో దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతోంది. టీపీసీసీ ఇంఛార్జ్ గా మాణిక్‌రావు ఠాక్రే బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వరకు అంతర్గత గొడవలు తగ్గాయి. పీసీసీ ఛీఫ్ రేవంత్‌పై పార్టీలో అసమ్మతి జ్వాలలు తగ్గించడంలో ఠాక్రే కీలకంగా వ్యవహరించారని టాక్. గాంధీభవన్ లో అందుబాటులో ఉంటూ..సైలెంట్ గా తనపని తాను చేసుకుపోతున్నారు. నేతల చేరికలపై ఎప్పటికప్పుడు ఫోన్ లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎటువంటి హంగామా లేకుండా తెరవెనక పావులు కదుపుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు జాతీయ పార్టీల నేతలు. నలుగురు ఇంఛార్జ్ లతో బీజేపీ.. ఒకే ఇంఛార్జ్ తో కాంగ్రెస్ ఎన్నికల రేసులో దిగుతున్నాయి. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: TS: సైలెంట్ అయిన బీజేపీ నేతలు.. ఢిల్లీ పెద్దల డైరెక్షన్ ఇదే?
Comments
Please login to add a commentAdd a comment