సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రాకపోయినా.. మూడు ప్రధాన పార్టీలు మాత్రం ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు మునుగోడు బాటపట్టడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ఒకదఫా బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్.. శనివారం ఇంటింటి ప్రచారం మొదలుపెడుతుండగా.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో శనివారం మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతో టీఆర్‌ఎస్ సత్తా ఏమిటనే బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మునుగోడు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారికంగా చేరుతుండటంతోపాటు.. వివిధ పార్టీలకు చెందిన మరికొందరు నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో..
వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఉప ఎన్నికే అయినా తమ శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నాయి. ప్రచారం కోసం ముఖ్య నేతలంతా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. దీనితో మునుగోడు ఉప ఎన్నిక మరింత రక్తికడుతోంది.
కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం
మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఆ పార్టీకి బలమైన కేడర్ ఉంది. ఎట్టిపరిస్థితుల్లో దీనిని నిలబెట్టుకోవాలని, తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మునుగోడులో విజయం సాధిస్తే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని, ప్రజల్లోనూ నమ్మకం వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా శనివారం నుంచి ఇంటింటి ప్రచార కార్యక్రమం, ఓటర్లకు పాదాభివందనం అనే వినూత్న కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమం బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ వీడకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు మధుయాష్కీ, బలరాం నాయక్, మహేశ్వర్‌రెడ్డి, రేణుకా చౌదరి, దామోదర రాజనర్సింహ, దామోదర్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ తదితర నాయకులకు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించారు.
బీజేపీకి, రాజగోపాల్‌రెడ్డికి ప్రతిష్టాత్మకం..
మునుగోడు బీజేపీ స్థానం కాకపోయినా.. అక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రాజీనామా చేయించి ఉప ఎన్నిక రావడానికి కారణమైంది. ఈ క్రమంలో అటు బీజేపీకి, ఇటు రాజగోపాల్‌రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంపై వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉన్నా.. బీజేపీ జాతీయ నేతలు స్వయంగా రంగంలోకి దిగడం చూస్తుంటే ఆ పార్టీ ఈ ఎన్నికపై ఎంతగా దృష్టి పెట్టిందో స్పష్టమవుతోంది. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపును ఇక్కడా కొనసాగించి.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని చాటాలన్నది బీజేపీ వ్యూహం. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరాలనే పట్టుదలతో ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు దీటుగా భారీ జన సమీకరణపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌లోని తన అనుచరులు, ఇతర నేతలు కూడా బీజేపీలో చేరేవిధంగా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మండలాల వారీగా ఇన్‌చార్జులను నియమించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారమే మునుగోడు వెళ్తున్నారు. ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రమేశ్‌రాథోడ్, మనోహర్‌రెడ్డి తదితర నేతలు ఇప్పటికే మునుగోడులో తిరుగుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్ పెట్టేలా టీఆర్‌ఎస్ వ్యూహాలు
టీఆర్‌ఎస్ కూడా మునుగోడులో విజయం సాధించడం ద్వారా ఒకేసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా పోరుకు సిద్ధమవుతోంది. బల ప్రదర్శనకు వేదికగా మలుచుకుంటోంది. 2018లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సాధించాలని చూస్తోంది. మునుగోడును కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే పట్టు ఉందని చూపుకోవడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయానికి మార్గం వేసుకోవడం వీలవుతుందని టీఆర్‌ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ శనివారం మందీ మార్బలంతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే కార్యక్రమం జరుగుతోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి పూర్తిగా మునుగోడు నియోజకవర్గానికే అంకితమయ్యారు. ఇక ఆ నియోజకవర్గంలో తలెత్తిన అసమ్మతిని సీఎం స్వయంగా చక్కబెట్టారు కూడా. కాగా మునుగోడు సభా వేదికగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
చదవండి: అగ్గి రాజేసిన ఫీజు
Comments
Please login to add a commentAdd a comment