BJP Planning Uttar Pradesh Style Politics In Telangana - Sakshi
Sakshi News home page

రూట్‌ మార్చిన బీజేపీ.. తెలంగాణలో యూపీ వ్యూహం!

Jan 12 2023 10:29 AM | Updated on Jan 12 2023 12:46 PM

BJP Planning Uttar Pradesh Style Politics In Telangana - Sakshi

బహిరంగ సభలు, పాదయాత్రలు, వరుస సమావేశాలతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా  వేవ్ సృష్టించే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు రూట్ మార్చింది. అధికారంలోకి రావాలంటే పార్టీ గ్రౌండ్ లెవల్ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలని నమ్మిన జాతీయ నాయకత్వం మరో యాక్షన్ ప్లాన్ కు తెరలేపింది.  బేస్ బాగుంటేనే పార్టీ నిలుస్తుందని విశ్వసించే బీజేపీ యూపీలో అనుసరించిన ఫార్ములాతో రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది.

ఇప్పుడు తెలంగాణలోనూ ఉత్తరప్రదేశ్ లో రచించిన వ్యూహాలనే అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. బీజేపీ అగ్రద్వయం మోడీ, షా ఎక్కడైనా ఎంట్రీ ఇవ్వాలంటే ముందు బన్సల్ రంగంలోకి దిగి అంతా సెట్ చేస్తారనే టాక్. అందులో భాగంగానే యూపీ ఎలక్షన్ అనంతరం సునిల్ బన్సల్ ను హైకమాండ్ ఇక్కడికి పంపించింది. తెలంగాణ ఎన్నికల్లోనూ తనదైన మార్క్ వేయాలని బన్సల్ వ్యూహరచన చేస్తున్నారు.

ఈనెల 24 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్న బీజేపీ గ్రౌండ్ లెవల్లో నేతలకు రీచ్ కావడంపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న కాషాయదళం ఈనెల 24వ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. వరుస కార్యకలాపాలతో నేతలను ఎప్పటికప్పుడు యాక్టివ్ మోడ్ లో ఉంచడంపై ఫోకస్ పెడుతోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల అనంతరం ఈనెల 27న జిల్లా కార్యవర్గ సమావేశాలు, 28, 29 తేదీల్లో మండల కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. ఫిబ్రవరిలో శక్తి కేంద్రాల వారీగా కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళిక చేసుకుంది. పార్టీ గ్రౌండ్ లెవల్ ప్రిపరేషన్ పై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే 9 వేల శక్తి కేంద్రాల్లో సమావేశాలకు ప్లానింగ్ చేసుకున్నారు. శక్తి కేంద్రాల ఆధ్వర్యంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయనుంది. ఒక్కోరోజు అసెంబ్లీలోని ఒక్కో మండలంలో ఈ సమావేశాలు నిర్వహించే ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తోంది.

హైదరాబాద్‌కు షా
ఈనెలాఖరున తెలంగాణలో అమిత్ షా టూర్ ఉంది. రెండ్రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయి. ఒకరోజు ఖమ్మం జిల్లాలో అమిత్ షా పర్యటన కొనసాగితే మరోరోజు పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టిసారించనున్నట్లు టాక్. ఇప్పటికే వచ్చే ఎలక్షన్ కు మూడు నెలల పాటు ఎన్నికల క్యాలెండర్ ను సిద్ధం చేసుకున్న పార్టీ ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నిర్ణయం తీసుకుంది.

ఇటు సంస్థాగత బలోపేతంతో పాటు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్లాన్ చేసుకున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే పాలసీతో బీజేపీ ముందుకు వెళ్తోంది. యూపీలో వరుసగా రెండుసార్లు వరుసగా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అరుదు. అలాంటిది బీజేపీ సంస్థాగత బలపేతంపై దృష్టి పెట్టి గ్రౌండ్ లెవల్ లో స్ట్రాంగ్ చేసుకుంటూ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. అందుకే తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసి అధికారంలోకి రావాలని చూస్తోంది. గ్రౌండ్ లో ఉంటూ వాస్తవికతను అంచనా వేసి అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదును పెట్టనుంది.
- విక్రమ్, పొలిటికల్ రిపోర్టర్, సాక్షి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement