కాంగ్రెస్‌ బోనస్‌ పెద్ద బోగస్‌ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బోనస్‌ పెద్ద బోగస్‌

Published Tue, May 21 2024 6:29 AM

Harish Rao comments on Congress Party

ప్రస్తుత సీజన్‌ నుంచే అన్ని రకాల వడ్లకు బోనస్‌ చెల్లించాలి: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌ /దేవరకొండ: ఎన్నికల హామీ లను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్లకు బోనస్‌ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిందన్నారు. అదే తరహాలో వడ్లకు బోనస్‌ ఇచ్చే విషయంలోనూ కాంగ్రెస్‌ పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్‌ కోసం ఎదురుచూస్తుండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్‌ నుంచి బోనస్‌ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పదిశాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుంది. కానీ దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదు. కేవలం సన్న రకాలకే బోనస్‌ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్‌ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 

5నెలల్లోనే కుప్పకూలిన డయాగ్నొస్టిక్‌ వ్యవస్థ
తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్‌ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంపై ‘ఎక్స్‌’లో హరీశ్‌ స్పందించారు. నాణ్యమైన వైద్య పరీక్ష లను అందించిన డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ప్రస్తు తం నిర్వహణలోపంతో కొట్టుమిట్టాడుతున్నా యని చెప్పారు. 

బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు ఝూటా హామీలు
‘రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవు లకు ఝూటా హామీలు.. ఇది రేవంత్‌ పాలన’ అని హరీశ్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ తండ్రి కనీలాల్‌ ఇటీవల మరణించారు. ఆయనకు నివాళి అర్పించడానికి హరీశ్‌ రావు దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement