సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిదిన్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి నాలుగు భారీ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ బన్సల్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుల య్యారు. అదే సమయంలో ఆయనకు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బన్సల్ ఇప్పటివరకు బీజేపీ యూపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంచి వ్యూహకర్తగా గుర్తింపు
ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు యూపీలో అప్నాదళ్‌తో కలిసి బీజేపీ 73 స్థానాలు గెలుపొందడంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత బీజేపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పటికీ యూపీలో బీజేపీ 65 సీట్లు రాబట్టుకోగలిగింది. తాజాగా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 35 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టి మళ్లీ అధికారంలోకి రావడంతో సునీల్ బన్సల్ మంచి వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో..
వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే బీజేపీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్‌కు ఎక్కువ బాధ్యతలు ఉండటంతో, చేరికలు ఇతర వ్యవహారాల సమన్వయానికి వీలుగా ఆయన స్థానంలో బన్సల్‌ను నియమించినట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
చదవండి: మునుగోడుపై 16 నుంచి స్పెషల్ ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment