సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార గొంతులు, ధిక్కార స్వరాలు కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా ‘ఎక్స్’లో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను చదివాడన్నారు.
ప్రజా సేవ లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాకేశ్‌రెడ్డి.. వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపై రాకేశ్‌రెడ్డి పలు పుస్తకాలు కూడా రాశాడని కేటీఆర్ చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విద్యార్థులు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ, హనుమకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారన్నారు.
విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై రాకేశ్‌రెడ్డి గళం విప్పారని తెలిపారు. ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నందునే రాకేశ్‌రెడ్డిని శాసనమండలి పట్టభద్రుల కోటా ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు కేటీఆర్ చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..
వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని సాయి ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో పాల్గొని అక్కడి ఓటర్లతో మాట్లాడనున్నారు. అలాగే మధ్యా హ్నం 12 గంటలకు ఆలేరు నియోజవర్గంలోని ఎమ్మడి నరసింహారెడ్డి గార్డెన్స్‌లో జరిగే సమావేశంలో పాల్గొని ఓటర్లు, నాయకులతో కేటీఆర్ సమావేశం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment