సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జరిపే మార్పుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి అవసరమైన మేర సంస్థాగతంగా మార్పులు, ఎన్నికల ప్రచార కమిటీలు, మరింత మెరుగైన సమన్వయానికి ముఖ్యమైన కమిటీలను నియమించే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి.
రాష్ట్ర పార్టీలపై ప్రత్యేక దృష్టి..
తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివరించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ జాతీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సహా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై బుధవారం అర్ధరాత్రి వరకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దీనికి అమిత్‌షా, నడ్డాలతో పాటు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు.
ఈటల, రాజగోపాల్ సూచనలు
ఈ సందర్భంగా తెలంగాణలో నేతల సమన్వయలేమి, సీనియర్‌నేతలు అసంతృప్తి వ్యక్తంచేయడం, ముఖ్యనాయకుల ఏకపక్ష ధోరణి వంటి ఇటీవలి రాజకీయ పరిణామాలను షా, నడ్డాలు మోదీకి వివరించినట్టు సమాచారం. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లోపించడం, కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో మొదలైన చేరికలు, పార్టీ నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చలు వంటి అంశాలపై నివేదించారు. అలాగే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలంటే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు చేసిన సూచనలపైనా ఇందులో చర్చించినట్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా నడ్డాకు పలువురు సీనియర్‌నేతలు తమ అసంతృప్తిని, అందుకు గల కారణాలను వివరించిన సంగతి కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అయోమయం, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యమైన కమిటీలకు నియామకాలు..
అగ్రనేతల సమావేశంలో కొన్ని కీలక కమిటీల నియామకాలపై చర్చ జరిగిందని సమాచారం. జూలై మొదటి వారానికి ముఖ్యమైన కమిటీల నియామకాలను పూర్తి చేయాలని, నేతల మధ్య సమన్వయం చెడకుండా ఎప్పటికప్పుడు వారితో చర్చించాలని మోదీ సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో పాటే బడుగు, బలహీన వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పులతో పాటు, ఆయా రాష్ట్రాల నుంచి కొత్తవారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనే అంశంపై కూ డా చర్చలు జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
సమావేశం రద్దు..
అయితే ఏయే రాష్ట్రాల్లో మార్పులుచేర్పులు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. తెలంగాణలో నాయకత్వ మార్పుతో పాటు, కేంద్రమంత్రివర్గంలో ఒకరికి చోటు లభిస్తుందని ఊహాగానాలు వస్తున్నా, వాటిపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. ఇదే భేటీలో తెలంగాణలో ఈ నెల 8న ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వరంగల్‌లో ప్రధాని పర్యటనను పురస్కరించుకొని ఈ నెల 8న హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నాయకుల సమావేశాన్ని సైతం రద్దు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇది కూడా చదవండి: చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది!
Comments
Please login to add a commentAdd a comment