సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 25 నియోజకవర్గాల్లో బలోపేతంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, 25 సీట్లల్లో మాత్రం పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదరకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలన్నది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అంతేకాక పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా, 25 నియోజకవర్గాల్లో బలం ఉందని చూపించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి తమకుందని నిరూపించుకోవడం కూడా కీలకమన్న భావన ఉంది.
బీజేపీకి ఉన్న బలమెంత?
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తమకు పార్టీ కమిటీలున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పార్టీ అని సీపీఐ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్నామని చెపుతున్నారు. వాస్తవంగా ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ డబ్బుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందే కానీ, తమతో పోలిస్తే ఆ పార్టీ బలమెంత అని సీపీఐ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారం అధికంగా చేసుకుంటోందని, కానీ తాము అంత ప్రచారం చేసుకోవడంలేదని చెపుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని, తాము ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో బలమైన చోట్ల సీట్లను అడిగి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన విషయం విదితమే.
రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని అంటున్నారు. ‘బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలకు వెళతాము. అందుకోసం రాష్ట్రంలో వామపక్షాలు, టీఆర్‌ఎస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. అదే సందర్భంలో మేం గెలవగలిగే స్థానాలపై సరైన అవగాహనకు రావాల్సి ఉంది. పొత్తుల పేరుతో పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదు’అని ఒక నేత అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టిసారించారని నాయకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?
Comments
Please login to add a commentAdd a comment