Communist Party of India
-
‘గూడెం’లో నేడే ప్రజాగర్జన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు. హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. -
దేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. దీనిపై అప్పీలుకు వెళతామని ప్రకటించారు. త్వరలో జాతీయ హోదా పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న సీపీఐ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ పాల్గొన్నదని, ఈసీ నిర్ణయం విచారకరమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈసీ కేవలం సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకుందన్నారు. అయినా సీపీఐ ప్రజల్లో ఉంటుందని, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుందని ప్రకటించారు. ఇక సీపీఐకి జాతీయ హోదా రద్దు, ఆప్‌కు హోదా ఇవ్వడంలో రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారని ఆరోపించారు. జాతీయ పార్టీగా సీపీఐకి ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, దాన్ని ఎవరూ చెరిపివేయలేరని పేర్కొన్నారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, గోవా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కనబర్చిన పనితీరు ఆధారంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఇప్పటిదాకా ఉన్న జాతీయ పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్కు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్ఎల్డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమబెంగాల్లో ఆర్ఎస్సీ, మణిపూర్‌లో ఎంపీసీ పార్టీలకు ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక నాగాలాండ్‌లో ఎన్సీపీ, మేఘాలయలో టీఎంసీలకు త్వరలో రాష్ట్ర పార్టీ హోదా కల్పించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. నాగాలాండ్‌లో లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్), మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్రా మోతా పార్టీలకు ‘గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీ’ హోదా ఇస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు, సమీక్షల తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించింది. ప్రస్తుతం జాతీయ పార్టీలు ఆరు ఎన్నికల సంఘం తాజా చర్యల మేరకు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉన్నట్టయింది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. ► జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలోనే తమ పార్టీకి జాతీయ హోదా దక్కడం పట్ల కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ►1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. ►జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచి్చంది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. ►శరద్‌పవార్ 1999లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్సరంలో జాతీయ హోదా లభించింది. తర్వాత ప్రభావం తగ్గిపోయింది. ఏపీలో పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్కు హోదా రద్దు తెలంగాణ ఏర్పాటు నినాదంతో 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) ఏర్పాటైంది. 2004 సాధారణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ హోదా కోసం తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 16 చోట్ల బరిలోకి దిగింది. తెలంగాణలో ఐదు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోపాటు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకశాతం ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికల తర్వాత రాష్ట్ర పార్టీ హోదా దక్కింది. 2009 సాధారణ ఎన్నికలతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఏ ఇతర ఎన్నికల్లోనూ ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంనాటి రాష్ట్ర హోదా గుర్తింపు.. విభజన తర్వాత కూడా ఏపీలో కొనసాగింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం సమీక్షలో ఆ హోదాను కోల్పోయింది. -
25 అసెంబ్లీ సీట్లపై సీపీఐ దృష్టి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 25 నియోజకవర్గాల్లో బలోపేతంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, 25 సీట్లల్లో మాత్రం పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదరకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలన్నది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అంతేకాక పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా, 25 నియోజకవర్గాల్లో బలం ఉందని చూపించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి తమకుందని నిరూపించుకోవడం కూడా కీలకమన్న భావన ఉంది. బీజేపీకి ఉన్న బలమెంత? రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తమకు పార్టీ కమిటీలున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పార్టీ అని సీపీఐ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్నామని చెపుతున్నారు. వాస్తవంగా ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ డబ్బుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందే కానీ, తమతో పోలిస్తే ఆ పార్టీ బలమెంత అని సీపీఐ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారం అధికంగా చేసుకుంటోందని, కానీ తాము అంత ప్రచారం చేసుకోవడంలేదని చెపుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని, తాము ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో బలమైన చోట్ల సీట్లను అడిగి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన విషయం విదితమే. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని అంటున్నారు. ‘బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలకు వెళతాము. అందుకోసం రాష్ట్రంలో వామపక్షాలు, టీఆర్ఎస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. అదే సందర్భంలో మేం గెలవగలిగే స్థానాలపై సరైన అవగాహనకు రావాల్సి ఉంది. పొత్తుల పేరుతో పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదు’అని ఒక నేత అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టిసారించారని నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
బీజేపీతో చంద్రబాబుది వన్ సైడ్ లవ్: సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం: సుప్రీంకోర్టులో ఉచితాలు అనుచితాలంటూ కేసు వేయడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. బడుగు బలహీన వర్గాల మీద ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం తప్పని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు రద్దు చేయాలనుకోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. 'సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహన లోపానికి నిదర్శనం. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేశారు. ఎన్నికలయిన తర్వాత బీజేపీకి చంద్రబాబు సరెండర్ అవడానికి ప్రయత్నిస్తున్నాడు. బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాజకీయాలు నిలకడగా ఉండాలి. నిలకడలేని రాజకీయాలను ప్రజలు నమ్మరు. బీజేపీతో చంద్రబాబుది వన్ సైడ్ లవ్' అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. చదవండి: ('చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు') -
సీపీఎం పగ్గాలు మళ్లీ తమ్మినేనికే?
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం వరుసగా మూడోసారి ఎన్నిక కానున్నారని సమాచారం. పార్టీ నిబంధనల ప్రకారం మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఒక నేతను ఎన్నుకొనే అవకాశం ఉన్నందున ఈసారి కూడా ఖమ్మం కామ్రేడ్కే పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా సుముఖంగానే ఉందని, వచ్చే మహాసభల్లో గా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ్మినేనినే మరోమారు కార్యదర్శిగా కొనసాగించాలనే ప్రతిపాదన పెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ఆదివారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, కార్యదర్శివర్గంతోపాటు కార్యదర్శిని కూడా చివరిరోజు ఎన్నుకోనున్నారు. ఒకవేళ తమ్మినేని కాకపోతే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్. వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బి. వెంకట్లలో ఒకరిని ఎన్నుకొనే అవకాశం ఉందని ఎంబీ భవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర కార్యదర్శివర్గంలో మార్పులు! రాష్ట్ర కార్యదర్శివర్గంలో కూడా రెండు, మూ డు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా చెరుపల్లి సీతారాములు, నంద్యాల న ర్సింహారెడ్డి, సి.రాములు, సాయిబాబా, పోతి నేని సుదర్శన్, జాన్‌వెస్లీ, జ్యోతి, డి.జి.నర్సింహారావు, జి.రాములు, డాక్టర్. మిడియం బా బూరావులు కొనసాగుతున్నారు. వీరిలో జి. రాములు, మాజీ ఎంపీ మిడియం బాబూరావులు రిటైర్ అవుతారని అంటున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఢిల్లీ సెంటర్‌కు వెళ్తారని, ఆయన స్థానంలో మరో ట్రేడ్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్‌ను కార్యదర్శివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. జి.రాములు, బాబూరావుల స్థానం లో మరో ఇద్దరు నేతలకు అవకాశం వ స్తుందని, అందులో మరో మహిళానేతకు అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. సీఐటీయూ నాయకురాలు రమ, ఐద్వానేత మల్లు లక్ష్మిలో ఒకరిని కార్యదర్శివర్గంలోకి తీసుకొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. వామపక్ష ఐక్య కూటమి ఎటువైపు..? సీపీఎం రాష్ట్ర కమిటీ ఎన్నిక ఒక ఎత్తయితే పార్టీ మహాసభల్లో ఆమోదించే రాజకీయ తీర్మానంపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో ఉన్నాయి. తమకు ప్రధాన శత్రువైన బీజేపీని తెలంగాణలో బలపడకుండా చూడటమే తక్షణ రాజకీయ కర్తవ్యమని శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అలా అని ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్తో కలిసివెళ్లేది లేదని కూడా వెల్లడించారు. గత ఎన్నికల్లో లాల్, నీల్ ఎజెండాతో ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో వామపక్ష ఐక్య కూటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఎలాంటి రాజకీయ తీర్మానం చేస్తారన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్పై ప్రజాసమస్యల గురించి పోరాటాలు చేస్తూనే బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ సమయానికి కలిసి వెళ్తారా? కాంగ్రెస్‌ను కలుపుకుంటారా? లేక వామపక్ష ఐక్య కూటమితో ముందుకెళ్తారా? అన్నది వేచిచూడాల్సిందే! -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
భయాందోళనలు సృష్టించేందుకే ఎన్నార్సీ
కోల్‌కతా: దేశ లౌకిక విలువల్ని ధ్వంసం చేసి, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకే కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నార్సీ, పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. భారత జాతీయతా భావం స్థానంలో హిందూ జాతీయతా భావాన్ని చొప్పించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ 100వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత శక్తులు పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ), పౌరసత్వ (సవరణ)బిల్లును తీసుకువచ్చింది. కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని విభజనలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’అని ఆరోపించారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చేందుకు చేస్తున్న ఈ కుట్ర రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. కాగా, ఒకప్పటి యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో 1920 అక్టోబర్ 17వ తేదీన భారతీయ నాయకుల నేతృత్వంలో ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ(ఐసీపీ)అవతరించింది. -
‘తగ్గేదే లేదు..5 స్థానాల్లో పోటీకి దిగుతాం’
సాక్షి, హైదరాబాద్ : కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాకూటమిలో భాగమైన సీపీఐ 9 సీట్లు డమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ పెద్దలు 3 సీట్లు మాత్రమే ఇస్తాననడం దారుణమని పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, గోదా శ్రీరాములు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను ఓడించే ప్రధాన లక్ష్యంతోనే సీపీఐ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. (‘సీట్ల కేటాయింపు మింగుడుపడటం లేదు’) ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ సీట్ల కేటాయింపులు చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్ఎస్ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని నేతలు ఆకాక్షించారు. ఉమ్మడి రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తి పరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. -
ప్రజాస్వామ్య ఐక్యకూటమి ద్వారా ఉద్యమాలు
♦ స్థానిక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో ఆందోళనలు ♦ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడి గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రజాస్వామ్య ఐక్య కూటమిని ఏర్పాటుచేసి ఉద్యమాలు చేపడతామని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఈనెల 8న బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వం పట్ల మధ్యతరగతి ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా పేర్కొన్నారు. హర్యానా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హతను పరిగణనలోకి తీసుకోవడం దళిత, ఆదివాసీలను ఎన్నికలకు దూరం చేయడమేనన్నారు. అదేవిధంగా రాజస్తాన్‌లో మరుగుదొడ్డి నిర్మాణం లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించడం ఆక్షేపణీయమన్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమాలు చేపట్టనున్నట్టు సురవరం వెల్లడించారు. కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు షమీమ్ ఫైజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులు పెంచడంతోపాటు 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. హెచ్ఎంటీ యూనిట్లను మూసివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి ఆహార భద్రతను కల్పించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
దిద్దుబాటు లక్ష్యంగా సీపీఎం ప్లీనం
సాక్షి, హైదరాబాద్: నానాటికీ కుంచించుకుపోతున్న పునాదిని పటిష్టపరిచి పార్టీ పలుకుబడిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు-సీపీఎం) నిర్మాణ ప్లీనం నిర్వహణకు రంగం సిద్ధమైంది. బలం, బలహీనతల గుర్తింపు, దిద్దుబాటుకు ఉద్దేశించిన ఈ ప్లీనంను ఈనెల 27 నుంచి 31 వరకు కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 436 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ‘నిర్మాణంపై రూపొందించిన ముసాయిదా నివేదిక’ను అంశాలవారీగా చర్చించి దిశానిర్దేశం చేస్తుంది. ఈ సందర్భంగా తొలిరోజున పది లక్షలమందితో బహిరంగసభను నిర్వహించనున్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్లీనం జరుగుతోంది. 1978 డిసెంబర్లో సాల్కియాలో ప్లీనం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ప్లీనం నిర్వహించడం ఇదే. ఏపీ కమిటీలో ఫ్యూడల్ భావనలే ఎక్కువ! ఆంధ్రప్రదేశ్ కమిటీలో మెజారిటీ సభ్యులు ప్రగతిశీల విలువలను పాటించట్లేదని ముసాయిదా నివేదికలో పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, కులతత్వం, అభివృద్ధి నిరోధక సంప్రదాయాలు, మహిళల్ని వంటింటి కుందేళ్లుగా చూసే ఫ్యూడల్ భావన ఏపీ కమిటీలో ఉన్నట్టు గుర్తించింది. వీటిని సంస్కరించి పార్టీని గాడిన పెట్టడంపై ప్లీనం దృష్టిపెట్టనుంది. సదస్సుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, తమ్మినేని వీరభద్రంతోపాటు కార్యదర్శివర్గ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతున్నారు. -
సంక్షోభ పరిష్కర్త ఈ మార్క్సిస్టు!
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి మంచి వ్యూహకర్తగా, సంక్షోభాల పరిష్కర్తగా పేరుంది. సంక్షోభం ఎక్కడ ఉంటే ఏచూరి అక్కడ ఉంటారు. ఆయన మంచి నెగోషియేటర్. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని భీష్మించే చిదంబరం వంటి వారితో కలసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రచించగలరు... అత్యంత మొండిగా వ్యవహరించే నేపాల్ రాజకీయ పార్టీలు- మావోయిస్టులకు మధ్య ప్రజాస్వామ్య ఒప్పందాన్నీ కుదర్చగలరు. అది 1977 నాటి మాట... ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కార్యాలయం... విద్యార్థి నాయకులంతా ఆవేశంగా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ యూని వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ను ఆ పదవి నుంచి తొలగించాల్సిందేనని భీష్మించారు. మొరార్జీ కూడా పట్టుదలతో ఉన్నారు. ముందు మీరు సమ్మె విరమించండి చూద్దాం అన్నారు. ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు... సమస్య పరిష్కారం కాక పోగా తెగేవరకు సాగేలా ఉంది... అంతలో ఒక్కగొంతు వినిపించింది. ‘‘ఓకే వియ్ విల్ కాల్ ఆఫ్ అవర్ స్ట్రైక్.. ప్లీజ్ సాల్వ్ ఆల్ ద ఇష్యూస్.’’ ప్రధాని సహా అంతా ఆశ్చర్యపోయారు. విద్యార్థులను ఒప్పించడం సాధ్యమయ్యే పనేనా అని. కానీ ఆ యువకుడు విద్యార్థులతో చర్చించాడు. అందరినీ ఒప్పిం చాడు. సమ్మె విరమింపజేశాడు. ఆ యువకుడిలో చర్చించే చొరవ, సమస్య లను విశ్లేషించే సామర్థ్యం, పరిష్కారం దిశగా నడిపించే నేర్పు ఆ తర్వాత అయన్ని అనేక మెట్లు ఎక్కించాయి. భారత రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ యువకుడే సీతారాం ఏచూరి... భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి మంచి వ్యూహకర్తగా, సంక్షోభాల పరిష్కర్తగా పేరుంది. సంక్షోభం ఎక్కడ ఉంటే ఏచూరి అక్కడ ఉంటారు. ఆయన మంచి నెగోషియేటర్. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని భీష్మించే చిదం బరం వంటి వారితో కలసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రచించగలరు... అత్యంత మొండిగా వ్యవహరించే నేపాల్ రాజకీయ పార్టీలు- మావోయి స్టులకు మధ్య ప్రజాస్వామ్య ఒప్పందాన్నీ కుదర్చగలరు. అన్యవర్గ ధోరణు లను పారదోలడం కోసం పార్టీలో దిద్దుబాటు ఉద్యమం నడపాలన్న ఆలో చనకు అక్షర రూపమివ్వాలన్నా ఆయనే... అత్యంత కీలకమైన సైద్ధాంతిక డాక్యుమెంట్లు రూపొందించాలన్నా ఆయనే.. అంతేకాదు నేడు సీపీఎంకు అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలతో సుహృద్భావ సంబంధాలున్నాయంటే అందుకు ఏచూరి చొరవే కారణం. పీవీ నరసింహారావు తర్వాత అంతటి బహుభాషా నైపుణ్యం మన రాజకీయ నాయకులలో ఏచూరికే ఉందని ఆయన సన్నిహితులు అంటారు. తెలుగు, తమిళ, బంగ్లా, హిందీ, ఇంగ్లిష్ లలో ఆయన బాగా మాట్లాడగలరు. ఎంతో సంక్లిష్టమైన సైద్ధాంతిక అంశా లను సైతం అరటిపండు ఒలిచినట్లు విడమరిచి చెప్పగలరు. సైద్ధాంతిక పడి కట్టు పదాలతో దాడిచేయకుండా వాటిని నేటి పరిస్థితులకు అన్వయించి అర్థమయ్యేలా చెప్పడం ఏచూరి ప్రత్యేకత. 13 ఏళ్లపాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరికిషన్ సింగ్ సూర్జిత్‌కు సీతారాం ఏచూరి ప్రియ శిష్యుడు. ఆయనకే కాదు మాకినేని బసవపున్నయ్య, ఈఎంఎస్ నంబూద్రిపాద్లకూ ఏచూరి అత్యంత ఇష్టుడే. వారి మార్గదర్శ కత్వంలోనే ఏచూరి రాటు దేలారు. ఒక జిల్లా యూనిట్కుగానీ, రాష్ర్ట యూని ట్‌కు గానీ నాయకత్వం వహించిన అనుభవం లేకుండానే కేంద్ర కమిటీలోకి, పొలిట్‌బ్యూరోలోకి ఏచూరి ఎంపికయ్యారని విమర్శకులంటుంటారు. కానీ ఆయన విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సీపీఎం విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ ప్రతిష్టాత్మకమైన జెఎన్యూ అధ్యక్షుడిగా మూడుమార్లు ఎన్నికయ్యారు. అంతేకాదు 1978లో ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా 1984లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జెఎన్యూలో రెసిస్టెన్స్ సంస్థను ఏర్పాటుచేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు వారాల పాటు జైలు జీవితాన్నీ అనుభ వించారు. ఏచూరికి ఉన్న విశ్లేషణా సామర్థ్యం, సమయస్ఫూర్తి, చర్చించే నేర్పు పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరువ చేశాయి. 1985లో మూడు పదుల వయసులోనే ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఆ మరుసటి సంవ త్సరం నుంచి ఆయన కార్యక్షేత్రం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఏకేజీ భవనే. 1988లో తిరువనంతపురంలో జరిగిన 13వ మహాసభలో ఏచూరి సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1992లో చెన్నైలో జరిగిన పార్టీ మహాసభలో పొలిట్‌బ్యూరోకు ఏచూరిని ఎన్నుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ఏచూరి మేధస్సుకు మరింత పదును పెట్టాయి. సీపీఎంకు సంబంధించిన అన్ని కీలకమైన సైద్ధాంతిక డాక్యుమెంట్ల రూపకల్పనలో ఆయనది ప్రధానమైన భూమిక. అంతేకాదు 1996 నుంచి పార్టీ అధికారిక వార పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’కి సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వ్యాసాలు రాశారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’, ‘వాటీజ్ దిస్ హిందూ రాష్ర్ట’, ‘సోష లిజం ఇన్ 21 సెంచరీ’, ‘కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజమ్’ వంటివి ఆయన రాసిన పుస్తకాలలో కొన్ని. ఏచూరి మంచి చదువరి కూడా. ఆయన వెంట ఎప్పుడూ రెండు మూడు పుస్తకాలు ఉంటాయి. 2004లో ఓ ఇంట ర్వ్యూ సందర్భంగా ఈ వ్యాసకర్తతో ఏచూరి మాట్లాడుతూ అధ్యయనానికి ఉన్న ఆవశ్యకతను వివరించారు. కేంద్రకార్యాలయ బాధ్యతలతోపాటు పార్టీ సభలు, సమావేశాల కోసం తరచూ దేశమంతా తిరుగుతూ ఎప్పుడూ బిజీగా ఉండే మీరు పుస్తకాలు ఎప్పుడు చదువుతారన్న ప్రశ్నకు ప్రయాణ సమ యాన్ని అలా సద్వినియోగం చేస్తానని ఆయన సమాధానమిచ్చారు. ఏచూరికి అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన అపారం. అందుకే ఆయన పార్టీ కేంద్రంలో అంతర్జాతీయ విభాగ బాధ్యతలు కూడా చూస్తుంటారు. సోవి యట్ యూనియన్, జకొస్లొవేకియా, రుమేనియా, జర్మనీ, చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియాలలో పర్యటించారు. అనేక అంతర్జాతీయ సెమి నార్లలో పాల్గొన్నారు. ఈసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నిక ముందు నుంచీ ఊహిస్తు న్నదే. నిజానికి 2005లో ఢిల్లీలో జరిగిన 18వ మహాసభల సందర్భంగా కూడా సీతారాం ఏచూరి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రకాశ్ కారత్కు ఆయన గట్టిపోటీగా నిలిచారు. అయితే పార్టీ నాయకత్వం కారత్ వైపు మొగ్గిం ది. కారత్ బాధ్యతలు చేపట్టే నాటికి సీపీఎం అత్యంత ఉచ్ఛదశలో ఉన్నది. 62 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్‌కు అతిపెద్ద మిత్ర పక్షంగా ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలలో సీపీఎం నాయకత్వంలో ప్రభు త్వాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదు ర్కొంది. బెంగాల్లో నందిగ్రామ్ కాల్పుల ఉదంతం పార్టీకి మాయని మచ్చ లా మారింది. దరిమిలా మూడున్నర దశాబ్దాల లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వమూ కుప్పకూలింది. పార్లమెంటులోనూ బలం పరిమితమైపోయింది. ఇలాంటి సంక్షుభిత సమయంలో పార్టీ ప్రధానకార్యదర్శిగా ఏచూరి బాధ్యతలు తలకె త్తుకున్నారు. ఇటు పార్టీని పునరుజ్జీవింపజేయడం, వామపక్ష, లౌకిక పార్టీల న్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడం ఏచూరి ముందున్న ప్రధాన లక్ష్యాలు. అంతేకాదు ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘మతోన్మాద, ఉదారవాద జంట ప్రమాదాలను ఎదుర్కోవడం ఇపుడు అన్నిటికన్నా ప్రధానమైనది’. వర్గ పోరా టాలను ఉధృతం చేయడంతోపాటు సామాజిక అణచివేతపైనా ఉద్యమిస్తా మని, తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని ఏచూరి అంటున్నారు. ఈ సవాళ్లన్నిటినీ ఆయన ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు కాలమే సమాధానమివ్వాలి. పోతుకూరు శ్రీనివాసరావు -
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం
నారాయణకు ప్రమోషన్ 9 మందితో కేంద్ర కార్యదర్శివర్గం కేంద్ర కమిటీలో చాడ, రామకృష్ణ పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ఐదు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ జాతీయ మహాసభల ఆఖరి రోజైన ఆదివారం వచ్చే మూడేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం ఎన్నిక కావడం ఇది రెండో సారి. చాలా కాలం తర్వాత పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పోస్టును ఏర్పాటు చేసి సీనియర్ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తాకు అప్పగించారు. ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణకు ప్రమోషన్ ఇచ్చి కేంద్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. 125 మందితో జాతీయ సమితిని, 31 మందితో కేంద్ర కమిటీని, 9 మంది చొప్పున కార్యదర్శివర్గాన్ని, కేంద్ర కంట్రోల్ కమిషన్‌ను ఎన్నుకుంది. జాతీయ కార్యదర్శివర్గానికి ఎన్నికైన వారిలో ప్రధాన కార్యదర్శి, ఉప ప్రధాన కార్యదర్శితో పాటు డి.రాజా (తమిళనాడు), కె.నారాయణ (ఆంధ్రప్రదేశ్) తదితరులు ఉన్నారు. శాశ్వత ప్రోగ్రాం కమిషన్ చైర్మన్ హోదాలో పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్ కేంద్ర కార్యదర్శివర్గ భేటీకి హాజరవుతారు. కేంద్ర కమిటీకి ఎన్నికైన తెలుగువారిలో కె.నారాయణ, అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ ఉన్నారు. జాతీయ సమితికి తెలంగాణ నుంచి 9మంది, ఏపీ నుంచి ఆరుగురు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, సిద్ది వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, కె.శ్రీనివాసరెడ్డి, రామనరసింహారావు, గుండా మల్లేష్ (కంట్రోల్ కమిషన్ సభ్యునిగా), వలి ఉల్లా ఖాద్రీ (ఏఐఎస్ఎఫ్ కోటా), ఏపీ నుంచి కె.రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, పీజే చంద్రశేఖర్, జల్లి విల్సన్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు (కంట్రోల్ కమిషన్ చైర్మన్) జాతీయ సమితికి ప్రాతినిధ్యం వహిస్తారు. సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి కార్మికరంగం నుంచి జాతీయ సమితి సభ్యులుగా ఉంటారు. ఏపీ తెలంగాణ విభేదాలను విడనాడండి: సురవరం విభజనతో వచ్చిన విభేదాలను విడనాడి సమైక్యత, సమభావంతో తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం మొదలు కమ్యూనిస్టుల ఐక్యత, దేశ, రాష్ట్ర రాజకీయాల వరకు అనేక అంశాలపై పార్టీ మహాసభ దిశానిర్దేశం చేసిందని సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
సీపీఎంరాష్ట్ర కార్యదర్శివర్గంలోకి జూలకంటి
నర్సింహారెడ్డితో పాటు రంగారెడ్డికి చోటు మరో ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం జిల్లా నుంచి పార్టీలో పెరిగిన ప్రాతినిధ్యం (సాక్షి ప్రతినిధి, నల్లగొండ) : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శివర్గానికి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పార్టీ తొలి మహాసభల్లో ఆయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శివర్గంలో జిల్లా కార్యదర్శిగా నంద్యాల నర్సింహారెడ్డి ఉండగా, ఇప్పుడు కొత్తగా జూలకంటికి అవకాశం కల్పించారు. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు జిల్లా నేతలను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యులైన తుమ్మల వీరారెడ్డి, తిరందాసుగోపి, ముల్కలపల్లి రాములుకు మళ్లీ రాష్ట్ర కమిటీలో అవకాశం లభించగా, కొత్తగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎం.డి.జహంగీర్‌లను కూడా రాష్ట్ర కమిటీలోకి తీ సుకున్నారు. దీంతో మొత్తం రాష్ట్ర కమిటీలో జిల్లాకు ఏడు బె ర్తులు దక్కినట్టుయింది. ఇందులో ఇద్దరిక కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి కార్యదర్శివర్గంలో స్థానం దక్కడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్ర కమిటీలో స్థానం ఉండేది. వీరిలో న ంద్యాల నర్సింహారెడ్డిని గతంలోనే ఏర్పాటు చేసిన తె లంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గంలోనికి తీసుకున్నారు. జిల్లా కార్యదర్శి హోదాలో మరోసారి ఆయన కార్యదర్శివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఈసారి రాష్ట్ర కమిటీలో మొత్తం ఏడుగురికి స్థానం దక్కడంతో సీపీఎంకు బలమైన జిల్లాగా పేరున్న నల్లగొండ ప్రాతినిధ్యం మొత్తం మీద ఆ పార్టీలో పెరిగినట్టయింది. కార్మిక నాయకుడి నుంచి శాసనసభా పక్ష నేత వరకు.... మిర్యాలగూడ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగారెడ్డి 1994, 2004, 2009లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 కంటే ముందు ఆయన మిర్యాలగూడ మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పార్టీ శాసనసభాపక్ష నేత హోదాలో పనిచేశారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన సీఐటీయూ లో చురుకుగా పనిచేసి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన జూలకంటి జిల్లాలో జరిగిన అనేక ప్రజాపోరాటాల్లో తన వంతు పాలుపంచుకున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం పక్షాన ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష అప్పట్లో సంచలనం సృష్టిం చింది. సాగర్ రైతాంగానికి నీటిని విడుదల చేయాలంటూ ఆయన 11 రోజుల పాటు మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేశారు. -
తొలి మహాసభలను జయప్రదం చేద్దాం
సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం పిలుపు హైదరాబాద్: భారత కమ్యూనిస్టుపార్టీ(మార్కిస్టు) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు మార్చి 1 నుంచి 4 వరకు హైదరాబాద్ నగరంలో జరగనున్నాయని, వాటిని అంతా కలసి జయప్రదం చేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆ మహాసభల్లో వామపక్షాల ఐక్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సీపీఐ, సీపీఐ(ఎం) మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల నేపథ్యంలో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రారంభించిన మెగా క్యాంపెయిన్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ ఎక్కడైనా విప్లవానికి ముందు ఒక మహత్తరమైన సాంస్కృతిక విప్లవం రావాలని చెప్పారు. అందుకోసం ఈ నెల 14న వీరబైరాన్‌పల్లిలో ఓ సాంస్కృతిక సైన్యం ఏర్పాటవుతుందన్నారు. దీనికి ప్రజా గాయకులు విమలక్క, గద్దర్‌లాంటి అతిరథ మహారథులు వస్తారన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా క్యాంపెయిన్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ తొలి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. తెలంగాణ సాయిధ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ మెగా క్యాంపెయిన్, ఇంటింటికి సీపీఎం కార్యక్రమం విజయవంత చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టులు మానవతావాదులన్నారు. భద్రాచలం ఎంఎల్ఎ సున్నం రాజయ్య మాట్లాడుతూ 23 రోజుల మెగా క్యాంపెయిన్‌కు హైదరాబాద్‌లో విశేష ఆదరణ వచ్చిందన్నారు. సభ ప్రారంభంలో ప్రజానాట్యమండలి కళాకారులు నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. తెలంగాణ సాయిధ పోరాట డాక్యుమెంటరీ ఫిల్మ్ సీడీ ఆవిష్కరించి, ప్రద ర్శించారు. ఈ కార్యక్రమంలో మహాసభల సమన్వయ కమిటీ సభ్యుడు బి.వెంకట్, సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, ఎస్ మల్లారెడ్డి, జి. నాగయ్య, చుక్క రాములు, నంద్యాల నర్సింహారెడ్డితో పాటు అన్ని జిల్లాల కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు
‘తెలంగాణకు దిశానిర్దేశం’పై చర్చ పొత్తులు, ఎత్తులపై అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి మూడురోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్ లో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, ఆంధ్రా నుంచి పి,మధు, ఎంఏ గఫూర్, పుణ్యవతి, వి.శ్రీనివాసరావుతో సహా దాదాపు 80 మంది కేంద్రకమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ఏప్రిల్ 14-19 తేదీల మధ్య విశాఖపట్టణంలో ఆ పార్టీ జాతీయమహాసభలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడిం ది. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావి స్తోంది. రాజకీయ తీర్మానం, అంతర్గత నిర్మాణం, కొత్త తెలంగాణకు దిశానిర్దేశంపై డాక్యుమెంట్లను ఆమోదిస్తారు. బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరిగింది.. అందుకు భిన్నంగా ఎటువంటి విధానాలను అనుసరించాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రగతిశీలశక్తులతో ఫ్రంట్: తమ్మినేని వామపక్ష, ప్రగతిశీలశక్తులు, దళిత, బీసీ, అభ్యుదయవాదులను కలుపుకుని ప్రజాతంత్ర ఫ్రంట్ ఏర్పాటునకు కృషి చేయనున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఫ్రంట్ రాజకీయ ప్రత్యామ్నాయం గా ముందుకురానున్నట్టు చెప్పారు. -
తమ్మినేనికి తెలంగాణ సారథ్యం !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణలోనే పార్టీకి మంచి పట్టున్న జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వీరభద్రం పేరు చాలా కాలంగా కార్యదర్శి పదవి కోసం వినిపిస్తోంది. తమ్మినేని రాజకీయ చతురత కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఆయన అయితేనే పార్టీని సమర్థంగా నడిపించగలరనే భావనతో పార్టీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ్మినేని పేరును పార్టీ తీవ్రంగా ఆలోచిస్తోంది. అయితే ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పరిశీలించిన అనంతరం, కేంద్ర కమిటీ ఆమోదం తీసుకొని తెలంగాణ పార్టీ కార్యదర్శి పేరు ను ప్రకటిస్తారని హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ వర్గాలు తెలిపాయి. తమ్మినేని పేరు కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆయన ఈసారి ఎన్నికల బరినుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పోటీలో మరొకరు.. ఈ పదవి కోసం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ఎస్.వీరయ్య పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నారు. గత రాష్ట్ర మహాసభల్లోనే ఈయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చేయవచ్చనే ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఒకరిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా త్వరలోనే ప్రకటించనున్నారు. అయతే సామాజిక కోణంలో ఆలోచిస్తే బీసీ వర్గానికి చెందిన వీరయ్యకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే కచ్చితంగా వీరభద్రాన్నే పదవి వరిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ కమిటీలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేశాయని, అందులో కొన్ని జిల్లాల నుంచి తమ్మినేని పేరు ప్రతిపాదనకు వచ్చిందని పార్టీ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. ఎలాంటి సమీకరణలు ఉన్నా తమ్మినేని పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయరా..? ఒకవేళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి లభిస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తమ్మినేని పోటీ చేయడం లేదని సమాచారం. పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన పోటీకి దిగకపోవచ్చని అంటున్నారు. సీపీఎం ఈ సారి పోటీ చేయాలనుకుంటే... గతంలో బరిలో నిలిచి ఓటమి చవిచూసిన సున్నం రాజయ్యను భధ్రాచలం నుంచి, మధిర నుంచి కమల్‌రాజ్‌ను రంగంలోకి దింపుతారు. అయితే గత ఎన్నికల్లో తమ్మినేని పోటి చేసిన పాలేరు నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ పేరు వినిపిస్తోంది. తమ్మినేని రాష్ట్ర కార్యదర్శి అవుతారు కనుకనే సుదర్శన్‌ను బరిలో దింపుతున్నారని, తమ్మినేని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని జిల్లాల పార్టీ వర్గాలంటున్నాయి. -
'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి'
-
'ఆ మూడు' మాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి
బస్సు మాఫియా, ఫిష్ మాఫియా, లిక్కర్ మాఫియాలు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆపార్టీ కేంద్ర నాయకుడు బర్థన్తోపాటు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై బూర్జువా పార్టీలు తమ విధానాన్ని మార్చుకున్నాయని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని జోస్యం చెప్పారు. అనంతరం ఆ సభలో బర్ధన్ మాట్లాడుతూ... కమ్యూనిస్టులు చీలిపోయినా అందరి లక్ష్యం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష లౌకికశక్తులు.. ఒకే వేదికపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని బర్ధన్ ఆరోపించారు. -
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: సీపీఐ
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే విభజనపై సీమాంధ్రుల ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఆ పార్టీ కేంద్ర సెక్రటేరియట్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది. ఉపాధి అవకాశాలు, నదీజలాల పంపకం, నూతన రాజధాని.. తదితర సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని, సీమాంధ్ర ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పాలని సూచించింది. వాస్తవాలను అర్థం చేసుకుని సీమాంధ్ర ప్రజలు ఆందోళనలను విరమించాలని కోరింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు మాట్లాడే ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆశిస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు -
మావోయిస్టుపార్టీపై నిషేధం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17తో ఆ పార్టీపై ఉన్న నిషేధం పూర్తవుతుండగా, తాజా నిర్ణయంతో నిషేధం మరో ఏడాదిపాటు కొనసాగుతుంది. ప్రజా భద్రతా చట్టం కింద మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధంగా పనిచేస్తున్న మరో 7 ప్రజాసంఘాలపై కూడా ఏడాది పాటు నిషేధం పొడిగించారు. 2005 ఆగస్టు 15న మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డితోపాటు తొమ్మిది మందిని మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. ఈ దాడి నేపథ్యంలో మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.