- ‘తెలంగాణకు దిశానిర్దేశం’పై చర్చ
- పొత్తులు, ఎత్తులపై అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి మూడురోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ లో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, ఆంధ్రా నుంచి పి,మధు, ఎంఏ గఫూర్, పుణ్యవతి, వి.శ్రీనివాసరావుతో సహా దాదాపు 80 మంది కేంద్రకమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు.
ఏప్రిల్ 14-19 తేదీల మధ్య విశాఖపట్టణంలో ఆ పార్టీ జాతీయమహాసభలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడిం ది. దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీపీఎం భావి స్తోంది. రాజకీయ తీర్మానం, అంతర్గత నిర్మాణం, కొత్త తెలంగాణకు దిశానిర్దేశంపై డాక్యుమెంట్లను ఆమోదిస్తారు. బూర్జువా పార్టీలతో పొత్తు వల్ల పార్టీకి ఏ విధంగా నష్టం జరిగింది.. అందుకు భిన్నంగా ఎటువంటి విధానాలను అనుసరించాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రగతిశీలశక్తులతో ఫ్రంట్: తమ్మినేని
వామపక్ష, ప్రగతిశీలశక్తులు, దళిత, బీసీ, అభ్యుదయవాదులను కలుపుకుని ప్రజాతంత్ర ఫ్రంట్ ఏర్పాటునకు కృషి చేయనున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఫ్రంట్ రాజకీయ ప్రత్యామ్నాయం గా ముందుకురానున్నట్టు చెప్పారు.