
సంక్షోభ పరిష్కర్త ఈ మార్క్సిస్టు!
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి మంచి వ్యూహకర్తగా, సంక్షోభాల పరిష్కర్తగా పేరుంది. సంక్షోభం ఎక్కడ ఉంటే ఏచూరి అక్కడ ఉంటారు. ఆయన మంచి నెగోషియేటర్. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని భీష్మించే చిదంబరం వంటి వారితో కలసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రచించగలరు... అత్యంత మొండిగా వ్యవహరించే నేపాల్ రాజకీయ పార్టీలు- మావోయిస్టులకు మధ్య ప్రజాస్వామ్య ఒప్పందాన్నీ కుదర్చగలరు.
అది 1977 నాటి మాట... ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కార్యాలయం... విద్యార్థి నాయకులంతా ఆవేశంగా ఉన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూని వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ను ఆ పదవి నుంచి తొలగించాల్సిందేనని భీష్మించారు. మొరార్జీ కూడా పట్టుదలతో ఉన్నారు. ముందు మీరు సమ్మె విరమించండి చూద్దాం అన్నారు. ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు... సమస్య పరిష్కారం కాక పోగా తెగేవరకు సాగేలా ఉంది... అంతలో ఒక్కగొంతు వినిపించింది. ‘‘ఓకే వియ్ విల్ కాల్ ఆఫ్ అవర్ స్ట్రైక్.. ప్లీజ్ సాల్వ్ ఆల్ ద ఇష్యూస్.’’ ప్రధాని సహా అంతా ఆశ్చర్యపోయారు. విద్యార్థులను ఒప్పించడం సాధ్యమయ్యే పనేనా అని. కానీ ఆ యువకుడు విద్యార్థులతో చర్చించాడు. అందరినీ ఒప్పిం చాడు. సమ్మె విరమింపజేశాడు. ఆ యువకుడిలో చర్చించే చొరవ, సమస్య లను విశ్లేషించే సామర్థ్యం, పరిష్కారం దిశగా నడిపించే నేర్పు ఆ తర్వాత అయన్ని అనేక మెట్లు ఎక్కించాయి. భారత రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆ యువకుడే సీతారాం ఏచూరి...
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)కి నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరికి మంచి వ్యూహకర్తగా, సంక్షోభాల పరిష్కర్తగా పేరుంది. సంక్షోభం ఎక్కడ ఉంటే ఏచూరి అక్కడ ఉంటారు. ఆయన మంచి నెగోషియేటర్. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అని భీష్మించే చిదం బరం వంటి వారితో కలసి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రచించగలరు... అత్యంత మొండిగా వ్యవహరించే నేపాల్ రాజకీయ పార్టీలు- మావోయి స్టులకు మధ్య ప్రజాస్వామ్య ఒప్పందాన్నీ కుదర్చగలరు. అన్యవర్గ ధోరణు లను పారదోలడం కోసం పార్టీలో దిద్దుబాటు ఉద్యమం నడపాలన్న ఆలో చనకు అక్షర రూపమివ్వాలన్నా ఆయనే... అత్యంత కీలకమైన సైద్ధాంతిక డాక్యుమెంట్లు రూపొందించాలన్నా ఆయనే.. అంతేకాదు నేడు సీపీఎంకు అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీలతో సుహృద్భావ సంబంధాలున్నాయంటే అందుకు ఏచూరి చొరవే కారణం. పీవీ నరసింహారావు తర్వాత అంతటి బహుభాషా నైపుణ్యం మన రాజకీయ నాయకులలో ఏచూరికే ఉందని ఆయన సన్నిహితులు అంటారు. తెలుగు, తమిళ, బంగ్లా, హిందీ, ఇంగ్లిష్ లలో ఆయన బాగా మాట్లాడగలరు. ఎంతో సంక్లిష్టమైన సైద్ధాంతిక అంశా లను సైతం అరటిపండు ఒలిచినట్లు విడమరిచి చెప్పగలరు. సైద్ధాంతిక పడి కట్టు పదాలతో దాడిచేయకుండా వాటిని నేటి పరిస్థితులకు అన్వయించి అర్థమయ్యేలా చెప్పడం ఏచూరి ప్రత్యేకత.
13 ఏళ్లపాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరికిషన్ సింగ్ సూర్జిత్‌కు సీతారాం ఏచూరి ప్రియ శిష్యుడు. ఆయనకే కాదు మాకినేని బసవపున్నయ్య, ఈఎంఎస్ నంబూద్రిపాద్‌లకూ ఏచూరి అత్యంత ఇష్టుడే. వారి మార్గదర్శ కత్వంలోనే ఏచూరి రాటు దేలారు. ఒక జిల్లా యూనిట్‌కుగానీ, రాష్ర్ట యూని ట్‌కు గానీ నాయకత్వం వహించిన అనుభవం లేకుండానే కేంద్ర కమిటీలోకి, పొలిట్‌బ్యూరోలోకి ఏచూరి ఎంపికయ్యారని విమర్శకులంటుంటారు. కానీ ఆయన విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సీపీఎం విద్యార్థి సంఘమైన ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తూ ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యూ అధ్యక్షుడిగా మూడుమార్లు ఎన్నికయ్యారు. అంతేకాదు 1978లో ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా 1984లో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జెఎన్‌యూలో రెసిస్టెన్స్ సంస్థను ఏర్పాటుచేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
రెండు వారాల పాటు జైలు జీవితాన్నీ అనుభ వించారు. ఏచూరికి ఉన్న విశ్లేషణా సామర్థ్యం, సమయస్ఫూర్తి, చర్చించే నేర్పు పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరువ చేశాయి. 1985లో మూడు పదుల వయసులోనే ఆయన కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఆ మరుసటి సంవ త్సరం నుంచి ఆయన కార్యక్షేత్రం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఏకేజీ భవనే. 1988లో తిరువనంతపురంలో జరిగిన 13వ మహాసభలో ఏచూరి సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1992లో చెన్నైలో జరిగిన పార్టీ మహాసభలో పొలిట్‌బ్యూరోకు ఏచూరిని ఎన్నుకున్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయ బాధ్యతలు ఏచూరి మేధస్సుకు మరింత పదును పెట్టాయి. సీపీఎంకు సంబంధించిన అన్ని కీలకమైన సైద్ధాంతిక డాక్యుమెంట్ల రూపకల్పనలో ఆయనది ప్రధానమైన భూమిక. అంతేకాదు 1996 నుంచి పార్టీ అధికారిక వార పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’కి సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వ్యాసాలు రాశారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’, ‘వాటీజ్ దిస్ హిందూ రాష్ర్ట’, ‘సోష లిజం ఇన్ 21 సెంచరీ’, ‘కమ్యూనిజం వర్సెస్ సెక్యులరిజమ్’ వంటివి ఆయన రాసిన పుస్తకాలలో కొన్ని. ఏచూరి మంచి చదువరి కూడా. ఆయన వెంట ఎప్పుడూ రెండు మూడు పుస్తకాలు ఉంటాయి. 2004లో ఓ ఇంట ర్వ్యూ సందర్భంగా ఈ వ్యాసకర్తతో ఏచూరి మాట్లాడుతూ అధ్యయనానికి ఉన్న ఆవశ్యకతను వివరించారు. కేంద్రకార్యాలయ బాధ్యతలతోపాటు పార్టీ సభలు, సమావేశాల కోసం తరచూ దేశమంతా తిరుగుతూ ఎప్పుడూ బిజీగా ఉండే మీరు పుస్తకాలు ఎప్పుడు చదువుతారన్న ప్రశ్నకు ప్రయాణ సమ యాన్ని అలా సద్వినియోగం చేస్తానని ఆయన సమాధానమిచ్చారు. ఏచూరికి అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన అపారం. అందుకే ఆయన పార్టీ కేంద్రంలో అంతర్జాతీయ విభాగ బాధ్యతలు కూడా చూస్తుంటారు. సోవి యట్ యూనియన్, జకొస్లొవేకియా, రుమేనియా, జర్మనీ, చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియాలలో పర్యటించారు. అనేక అంతర్జాతీయ సెమి నార్లలో పాల్గొన్నారు.
ఈసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నిక ముందు నుంచీ ఊహిస్తు న్నదే.
నిజానికి 2005లో ఢిల్లీలో జరిగిన 18వ మహాసభల సందర్భంగా కూడా సీతారాం ఏచూరి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రకాశ్ కారత్‌కు ఆయన గట్టిపోటీగా నిలిచారు. అయితే పార్టీ నాయకత్వం కారత్ వైపు మొగ్గిం ది. కారత్ బాధ్యతలు చేపట్టే నాటికి సీపీఎం అత్యంత ఉచ్ఛదశలో ఉన్నది. 62 మంది ఎంపీలతో పార్లమెంటులో కాంగ్రెస్‌కు అతిపెద్ద మిత్ర పక్షంగా ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలలో సీపీఎం నాయకత్వంలో ప్రభు త్వాలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదు ర్కొంది. బెంగాల్‌లో నందిగ్రామ్ కాల్పుల ఉదంతం పార్టీకి మాయని మచ్చ లా మారింది. దరిమిలా మూడున్నర దశాబ్దాల లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వమూ కుప్పకూలింది. పార్లమెంటులోనూ బలం పరిమితమైపోయింది. ఇలాంటి సంక్షుభిత సమయంలో పార్టీ ప్రధానకార్యదర్శిగా ఏచూరి బాధ్యతలు తలకె త్తుకున్నారు. ఇటు పార్టీని పునరుజ్జీవింపజేయడం, వామపక్ష, లౌకిక పార్టీల న్నిటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడం ఏచూరి ముందున్న ప్రధాన లక్ష్యాలు. అంతేకాదు ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘మతోన్మాద, ఉదారవాద జంట ప్రమాదాలను ఎదుర్కోవడం ఇపుడు అన్నిటికన్నా ప్రధానమైనది’. వర్గ పోరా టాలను ఉధృతం చేయడంతోపాటు సామాజిక అణచివేతపైనా ఉద్యమిస్తా మని, తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని ఏచూరి అంటున్నారు. ఈ సవాళ్లన్నిటినీ ఆయన ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు కాలమే సమాధానమివ్వాలి.
పోతుకూరు శ్రీనివాసరావు