
తమ్మినేనికి తెలంగాణ సారథ్యం !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తొలి కార్యదర్శి పదవి జిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను ఈ పదవిలో నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణలోనే పార్టీకి మంచి పట్టున్న జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండడంతో వీరభద్రం పేరు చాలా కాలంగా కార్యదర్శి పదవి కోసం వినిపిస్తోంది. తమ్మినేని రాజకీయ చతురత కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఆయన అయితేనే పార్టీని సమర్థంగా నడిపించగలరనే భావనతో పార్టీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ్మినేని పేరును పార్టీ తీవ్రంగా ఆలోచిస్తోంది. అయితే ఈనెల 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో పరిశీలించిన అనంతరం, కేంద్ర కమిటీ ఆమోదం తీసుకొని తెలంగాణ పార్టీ కార్యదర్శి పేరు ను ప్రకటిస్తారని హైదరాబాద్‌లోని ఎంబీ భవన్ వర్గాలు తెలిపాయి. తమ్మినేని పేరు కు గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆయన ఈసారి ఎన్నికల బరినుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
పోటీలో మరొకరు..
ఈ పదవి కోసం పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు ఎస్.వీరయ్య పేరు కూడా వినిపిస్తోంది. ఈయన కూడా కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నారు. గత రాష్ట్ర మహాసభల్లోనే ఈయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిని చేయవచ్చనే ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఒకరిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా త్వరలోనే ప్రకటించనున్నారు. అయతే సామాజిక కోణంలో ఆలోచిస్తే బీసీ వర్గానికి చెందిన వీరయ్యకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది. లేదంటే కచ్చితంగా వీరభద్రాన్నే పదవి వరిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ కమిటీలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేశాయని, అందులో కొన్ని జిల్లాల నుంచి తమ్మినేని పేరు ప్రతిపాదనకు వచ్చిందని పార్టీ నాయకుడొకరు ‘సాక్షి’కి చెప్పారు. ఎలాంటి సమీకరణలు ఉన్నా తమ్మినేని పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేయరా..?
ఒకవేళ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి లభిస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తమ్మినేని పోటీ చేయడం లేదని సమాచారం. పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఆయన పోటీకి దిగకపోవచ్చని అంటున్నారు. సీపీఎం ఈ సారి పోటీ చేయాలనుకుంటే... గతంలో బరిలో నిలిచి ఓటమి చవిచూసిన సున్నం రాజయ్యను భధ్రాచలం నుంచి, మధిర నుంచి కమల్‌రాజ్‌ను రంగంలోకి దింపుతారు. అయితే గత ఎన్నికల్లో తమ్మినేని పోటి చేసిన పాలేరు నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ పేరు వినిపిస్తోంది. తమ్మినేని రాష్ట్ర కార్యదర్శి అవుతారు కనుకనే సుదర్శన్‌ను బరిలో దింపుతున్నారని, తమ్మినేని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని జిల్లాల పార్టీ వర్గాలంటున్నాయి.