
ప్రజాస్వామ్య ఐక్యకూటమి ద్వారా ఉద్యమాలు
♦ స్థానిక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో ఆందోళనలు
♦ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడి
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రజాస్వామ్య ఐక్య కూటమిని ఏర్పాటుచేసి ఉద్యమాలు చేపడతామని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఈనెల 8న బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వం పట్ల మధ్యతరగతి ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
హర్యానా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి కనీస విద్యార్హతను పరిగణనలోకి తీసుకోవడం దళిత, ఆదివాసీలను ఎన్నికలకు దూరం చేయడమేనన్నారు. అదేవిధంగా రాజస్తాన్‌లో మరుగుదొడ్డి నిర్మాణం లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించడం ఆక్షేపణీయమన్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమాలు చేపట్టనున్నట్టు సురవరం వెల్లడించారు.
కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు షమీమ్ ఫైజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులు పెంచడంతోపాటు 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. హెచ్‌ఎంటీ యూనిట్లను మూసివేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పీడీఎస్ వ్యవస్థను బలోపేతం చేసి ఆహార భద్రతను కల్పించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పాల్గొన్నారు.