విచ్ఛిన్న యత్నాల్ని అడ్డుకుందాం
సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం పిలుపు
గుంటూరు వెస్ట్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంఘ్ పరివార్ శక్తులు దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ సమితి సమావేశాలు గుంటూరులో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి లాడ్జిసెంటర్‌లోని మహిమా గార్డెన్స్ వరకు పార్టీ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో సురవరం మాట్లాడుతూ కాంగ్రెస్ విధానాల్నే మరింత వేగంగా అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాసమస్యలను విస్మరిస్తున్నదని విమర్శించారు. సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాజా , సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సభకు అధ్యక్షత వహించారు.