అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి తెలంగాణ కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. టీకాంగ్రెస్ అడ్వైజర్ సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్‌లో ఏముందనే విషయంపై గాంధీభవన్‌లో మల్లగుల్లాలు పడుతున్నారు. 150 డేస్ యాక్షన్ ప్లాన్‌లో ఏముంది? తెలంగాణలో అధికారం సాధించడానికి కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్ ఏంటి?..
కర్నాటకలో సాధించిన విజయం తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న ఢిల్లీలో రాష్ట్ర పార్టీ నేతలతో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సమావేశం కాబోతున్నారు. అంతకంటే ముందుగా రాష్ట్రంలో పార్టీకి వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఒక నివేదిక అందించారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఇంకా బలం పెంచుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి సునీల్ తన నివేదికలో పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల వారిగా పార్టీ బలాలు, బలహీనతలతో స్పష్టమైన నివేదికను కనుగోలు టీం ఇచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా అధికార బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితా, బీజేపీలో నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్న నేతల జాబితా కూడా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలోని వారిలో కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నవారి పేర్లు, ఎవరిని తీసుకుంటే పార్టీకి ప్రయోజనం కలుగుతుందో అనే వివరాలు కూడా పొందుపరిచినట్లు సమాచారం. టిక్కెట్ హామీ ఇస్తే కాంగ్రెస్ గూటికి చేరే ముఖ్యుల జాబితా కూడా ప్రత్యేకంగా తయారు చేశారట. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులు మాత్రమే కాదు.. ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా మరింత మందిని ఆకర్షించాలని సూచించినట్లు చెబుతున్నారు.
150 రోజుల యాక్షన్ ప్లాన్..
పార్టీ మైలేజ్ పెంచడం కోసం పార్టీ పెద్దలకు 150 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట కనుగోలు టీమ్. 150 రోజుల్లో ఏ కార్యక్రమం చేస్తే ఏ మేరకు లాభం కలుగుతుంది అనేదానిపై వివరణాత్మక రిపోర్ట్ ఇచ్చారట. నేతలంతా ఐక్యంగా ఉన్నారనే ఇమేజ్ పార్టీకి ఇప్పుడు అవసరం అని అందుకోసం పీసీసీ, సీఎల్పీ, సీనియర్లతో బస్సు యాత్ర చేయించాలనే ప్రతిపాదనను సునీల్ టీం ఏఐసీసీ ముందు ఉంచిందట. ఇక దీనికి తోడు కేసీఆర్‌ను ముగ్గులోకి దింపడంలో కాంగ్రెస్ కొంతమేర సఫలీకృతం అయిందని, మరింతగా ఫోకస్ పెట్టాలని సూచించిందని టాక్. ధరణి వెబ్‌సైట్ విసయంలో సీఎం కేసీఆర్‌ను బయటకు లాగగలిగామని.. సీఎం నోటి నుంచే ధరణి సమస్యలను చెప్పించగలుగుతున్నామనే అంచనాలతో కనుగోలు టీం ఉందట. తెలంగాణ సెంటిమెంట్‌తోనే కాకుండా.. ప్రజా సమస్యల చుట్టూ ప్రచారం జరిగితే కాంగ్రెస్‌కే లాభం అని డిక్లరేషన్ల ద్వారా బీఆర్ఎస్‌ను మరింత ఇరకాటంలో పెట్టేందుకు గ్రామ స్థాయి నుండి కార్యాచరణ చేపట్టాలని సునీల్ టీం సూచించిందట.
దీంతో పాటు అనుబంధ విభాగాలతో ఆయా రంగ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని, ఇలా ఎవరికి వారు కార్యక్షేత్రంలో ఉంటేనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే రిపోర్ట్ సునీల్ ఇచ్చారట. ఈ రిపోర్ట్‌లోని అంశాల ఆధారంగానే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ ఉండనుందని, ఇక ఇదే ఎన్నికల శంఖారావంగా భావించొచ్చని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. సునీల్ టీమ్ ఇచ్చిన నివేదిక బాగానే ఉందని టీకాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కాని ఆ రిపోర్ట్‌ను అమలు చేయడం సాధ్యం అవుతుందా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉందనే టాక్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు: జితేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment