సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలకంగా వ్యవహరించారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. కాంగ్రెస్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. ఆదివారం విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ... కేవలం తెలంగాణలోనే విజయం సాధించి మిగిలిన మూడు రాష్ట్రాల్లో పరాజయం పాలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన సునీల్ అక్కడ కాంగ్రెస్‌ను విజయతీరాలకు తీసుకెళ్లడంలో విఫలమాయ్యారు.
అయితే దానికి రాజస్తాన్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలే కారణంగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహకర్త పనిచేసినా.. ఆయా రాష్ట్రాల అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, కమల్‌నాథన్‌లు సహకరించనట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజస్థాన్‌లో పలు చోట్ల సర్వేలు చేసి కొంత మంది అభ్యుర్థుల మార్పును సూచించినా అశోక్ గహ్లోత్ అంగీకరించలేదంట. అదీకాక నరేష్ అరోరా ఎన్నికల వ్యూహాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు సహరించినట్లుగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వ్యూహాల అమలు, అంతర్గత సర్వేల వంటి విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఏఐసీసీ ఎన్నికల వ్యూహ కమిటీ ఛైర్మన్‌గా కూడా నియమితులైన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో కూడా తన మార్క్ వ్యూహాలతో కాంగ్రెస్ గెలుపును సునాయాసం చేశారు. గతంలో బీజేపీకి కూడా సునీల్ పలు ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. 2014లో నరేంద్రమోదీకి ఎన్నికల ప్రచారంలో సేవలందించారు.
ఉత్తరప్రదేశ్, గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు ఆయాన వ్యూహకర్తగా సేవలందించారు. కర్ణాటకకు చెందిన సునీల్ కనుగోలు దేశంలోని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకరిగా పేరుపొందారు. అయితే.. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో కీలకసభ్యుడిగా పనిచేశారు. కర్ణాటక ఎన్నికల అనంతరం సునీల్‌కు.. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment