
ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఒకతాటిపైకి రావాలని వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్‌గా బిగ్ ఆఫర్ ఇచ్చింది.
వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆప్ జాతీయ ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాన్ని ఓకే అంటే తాము రెడీ ఉన్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం నియంతృత్వంలోకి వెళుతుందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్ధలను ఉసిగొల్పి విపక్ష నేతలను జైళ్లలో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ కాపీ కొడుతున్నదని ఆరోపించారు. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆప్ ఐడియాలు, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలేంటి..?
Comments
Please login to add a commentAdd a comment