ఢిల్లీ: ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికార బీజేపీకి ఎత్తులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కీలక నేతలతో ఈనెల 24వ తేదీన సమావేశం కానున్నారు.
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, మధ్యప్రదేశ్‌లో అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరారు. దీంతో, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనసాగుతోంది. మరోసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. రాజస్థాన్‌లో కూడా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా మారింది. ఇక, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు.. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పాదయాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించారు.
ఇది కూడా చదవండి: రూ.2,000 నోట్ల మార్పిడి ఇలా... బ్యాంక్ అకౌంట్ ఉండాలా?
Comments
Please login to add a commentAdd a comment