తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్‌లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు..
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్‌సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్‌లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్‌లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి.
కవిత, అర్వింద్ చేతిలో ఓటమి..
ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్‌లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
తెరపైకి ఎన్‌ఆర్‌ఐ!..
నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్‌లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్‌ఆర్‌ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్‌ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్!
Comments
Please login to add a commentAdd a comment