సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నిఘా పెరిగింది. ఎవరెవరు, ఏమేం చేస్తున్నారన్నది గంటగంటకు నిక్షిప్తమవుతోంది. మండలానికి ఒకరు చొప్పున మోహరించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది.. ముఖ్య నేతల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు.
రోజూ రెండుపూటలా ఈ సమాచారాన్ని హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్ల విషయంలో అయితే.. షాడో టీమ్‌లు వారి వెన్నంటే ఉంటున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ముఖ్య కార్యకర్తలు, సాధారణ ప్రజల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తున్నాయి. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, ఇతర పార్టీల నాయకులతో వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇంటెలిజెన్స్‌కు చిక్కకుండా.. గన్‌మెన్లను, సెల్‌ఫోన్లను సైతం వదిలేసి వెళ్తున్న ఘటనల వివరాలు కూడా రాజధానికి చేరుతున్నాయి.
30 నియోజకవర్గాలపై దృష్టి
అధికార బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, పోటీ ఉన్న 30 నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ ఫోకస్ మరింతగా పెంచింది. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ సభ నిర్వహిస్తుండటం, అదే సమయంలో ఆ జిల్లా ముఖ్య నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనతోపాటు పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగటం లేదంటూ గళం విప్పడంతో.. ఆ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలను లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఓడిన బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఈసారి ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఉన్నారు. ఇల్లెందులో కోరం కనకయ్య (కొత్తగూడెం జెడ్పీ చైర్మన్), పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లిలో పిడమర్తి రవి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ బృందాలు గ్రామాలు, మండలాల వారీగా రాజధానికి నివేదికలు పంపుతున్నాయి.
రంగారెడ్డిలో దూకుడుగా నేతలు
బీఆర్‌ఎస్ తరఫున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఇతర నేతలూ ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్‌లో రామ్మోహన్‌గౌడ్, ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా‹Ùరెడ్డితో పాటు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మునిగిపోయారు.
కేంద్ర బృందాల నిఘా సైతం
కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా రాష్ట్రంలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కేంద్ర మంత్రుల పర్యటనలు, స్థానిక ఆందోళనలు, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. కొల్లాç³Nర్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సిద్ధమయ్యారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన చల్లా వెంకట్రాంరెడ్డిని ఎక్కడి నుంచి పోటీలో దింపుతారన్న అంశం కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసక్తికరంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య– మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య వర్గపోరు సాగుతోంది. బీఆర్‌ఎస్‌తో వామపక్షాల పొత్తు కుదిరి మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సీపీఎం, సీపీఐ కోరితే.. ఎలాంటి సమీకరణ ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రోజుకో పరిణామం చేసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు జెడ్పీ చైర్మన్ల విషయంలోనూ ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment