Intelligence Agency report
-
అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘మారి్నంగ్ కన్సల్ట్’ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు. ‘మారి్నంగ్ కన్సల్ట్’ వెబ్సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నరేంద్ర మోదీకి సొంత దేశం భారత్‌లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తేలింది. అంటే దేశ జనాభాలో 78 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లు తేలింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ఆయన తొలి స్థానం దక్కించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోదీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు మోదీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్ మాన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండవ స్థానంలో నిలిచారు. -
కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరోగ్య పరిస్థితి గురించి మరో కథనం తెరపైకి వచ్చింది. ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్‌బర్గ్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా హౌజ్‌లలో కథనాలు పబ్లిష్ అయ్యాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(NIS) రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(నిద్రలేమి)కు సంబంధించి విదేశీ మెడికల్ ఇన్ఫర్మేషన్ను.. ప్రత్యేకించి జోల్పిడెమ్ లాంటి మందులకు సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట. ఎన్ఐఎస్ నివేదిక వివరాలను సౌత్ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ కార్యదర్శి యూ సాంగ్ బూమ్ మీడియాకు వెల్లడించారు. ఇన్సోమ్నియా ఉత్తర కొరియాను కలవరపెడుతోంది. అక్కడి పెద్ద తలకాయ ఆ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం మాకు ఉంది. అంతేకాదు.. దాని ట్రీట్మెంట్, మందుల సమాచారం కోసం విదేశీ వైద్యవిధానాల గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారని తేలింది. వీటితో పాటు తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించిన కొన్ని ఫొటోలను అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మళ్లీ విపరీతంగా బరువు పెరిగినట్లు స్పష్టమైందని బూమ్ తెలిపారు. వీటితో పాటుగా.. విదేశాల నుంచి మల్బరో, డన్హిల్ లాంటి విదేశీ బ్రాండ్ సిగరెట్లను, ఆల్కాహాల్‌తో పాటు తినే చిరు తిండ్లను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అతిగా మద్యం, ధూమపానం వల్ల కిమ్ ఆరోగ్యం దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 140 కేజీల బరువునకు ఆయన చేరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్లీపింగ్ డిజార్డర్ ఇన్సోమ్నియా ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే 16వ తేదీన ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్లాంటి మందుల్ని సైతం సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది అని సదరు నివేదిక సారాంశాన్ని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. నార్త్ కొరియాలో ఆహార కొరత కారణంగా.. ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు వచ్చిందని, కిమ్ అధికారంలోకి చేపట్టాక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ వస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రజల ఆకలిని పట్టించుకోకుండా.. విలాసాలు, హైప్రొఫైల్ పార్టీలతో కిమ్ కుటుంబం జల్సాలు చేస్తోందన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నిద్ర లేమి ఎంత ప్రమాదకరమంటే.. -
తెలంగాణపై ఇంటెలిజెన్స్ నిఘా.. ఎంపీలు, ఎమ్మెల్యేలపై షాడో టీమ్స్ ఫోకస్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై నిఘా పెరిగింది. ఎవరెవరు, ఏమేం చేస్తున్నారన్నది గంటగంటకు నిక్షిప్తమవుతోంది. మండలానికి ఒకరు చొప్పున మోహరించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది.. ముఖ్య నేతల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. రోజూ రెండుపూటలా ఈ సమాచారాన్ని హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్ల విషయంలో అయితే.. షాడో టీమ్‌లు వారి వెన్నంటే ఉంటున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ముఖ్య కార్యకర్తలు, సాధారణ ప్రజల విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తున్నాయి. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, ఇతర పార్టీల నాయకులతో వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇంటెలిజెన్స్‌కు చిక్కకుండా.. గన్మెన్లను, సెల్ఫోన్లను సైతం వదిలేసి వెళ్తున్న ఘటనల వివరాలు కూడా రాజధానికి చేరుతున్నాయి. 30 నియోజకవర్గాలపై దృష్టి అధికార బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు, పోటీ ఉన్న 30 నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ ఫోకస్ మరింతగా పెంచింది. ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహిస్తుండటం, అదే సమయంలో ఆ జిల్లా ముఖ్య నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనతోపాటు పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగటం లేదంటూ గళం విప్పడంతో.. ఆ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలను లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఈసారి ఎమ్మెల్యే కావాలన్న ఆశతో ఉన్నారు. ఇల్లెందులో కోరం కనకయ్య (కొత్తగూడెం జెడ్పీ చైర్మన్), పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లిలో పిడమర్తి రవి, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ బృందాలు గ్రామాలు, మండలాల వారీగా రాజధానికి నివేదికలు పంపుతున్నాయి. రంగారెడ్డిలో దూకుడుగా నేతలు బీఆర్ఎస్ తరఫున ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలే మళ్లీ బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఇతర నేతలూ ప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, ఎల్బీనగర్లో రామ్మోహన్‌గౌడ్, ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభా‹Ùరెడ్డితో పాటు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మునిగిపోయారు. కేంద్ర బృందాల నిఘా సైతం కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా రాష్ట్రంలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. కేంద్ర మంత్రుల పర్యటనలు, స్థానిక ఆందోళనలు, ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్య నాయకుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నువ్వా నేనా? వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ లోక్‌నాథ్‌రెడ్డి మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. కొల్లాç³Nర్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సిద్ధమయ్యారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన చల్లా వెంకట్రాంరెడ్డిని ఎక్కడి నుంచి పోటీలో దింపుతారన్న అంశం కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసక్తికరంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య– మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య వర్గపోరు సాగుతోంది. బీఆర్ఎస్తో వామపక్షాల పొత్తు కుదిరి మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సీపీఎం, సీపీఐ కోరితే.. ఎలాంటి సమీకరణ ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రోజుకో పరిణామం చేసుకుంటోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు జెడ్పీ చైర్మన్ల విషయంలోనూ ఆసక్తి నెలకొంది. -
పాక్ ఉగ్ర కుట్ర : పంజాబ్, రాజస్ధాన్‌లో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర దాడులపై నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్, రాజస్ధాన్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్, రాజస్ధాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన ముజహిదీన్ బెటాలియన్ సైన్యం సహకారంతో చొరబాట్లను ప్రోత్సహించవచ్చన్న సమాచారంతో ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పాక్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్య ఎదురైనా తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పటికే సైన్యం అదనపు సేనలను మోహరించింది. భారత్‌లో ఉగ్ర దాడులను చేపట్టేందుకు రాజస్ధాన్, పంజాబ్ సరిహద్దు ద్వారా చొరబాట్లను ప్రేరేపించేందుకు పాక్ సాఫ్ట్ టార్గెట్‌గా ఎంచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్ సరిహద్దుకు చేరువగా ఉన్న రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్ వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా పెంచాలని బీఎస్ఎఫ్తో పాటు వాయుసేనను నిఘా సంస్ధలు కోరాయి. మరోవైపు ఆర్టికల్ 370 రద్దుతో పుల్వామా తరహా దాడులు మరికొన్ని చోటుచేసుకుంటాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ఇమ్రాన్ వ్యాఖ్యలే పుల్వామా దాడి వెనుక పాక్ హస్తం ఉందనేందుకు ఆధారాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. -
ఇది వీసీ వైఫల్యమే
- హెచ్‌సీయూపై కేంద్రానికి నిఘా విభాగం నివేదిక - వర్సిటీని వీసీ అప్పారావు పూర్తిగా గాలికొదిలేశారు - నాలుగు నెలలుగా అరాచక పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు.. సమస్యలను పరిష్కరించలేదు - తనను కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు - విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగినా చూసీచూడనట్టు ఉన్నారు... వీసీ నిర్లక్ష్యం వల్లే గతేడాది ఆగస్టులో పరిణామాలు చినికిచినికి పెద్దవయ్యాయి - ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు.. కొందరు విద్యార్థి సంఘాల మధ్య చిచ్చుపెట్టారు - రోహిత్ సహా పలువురు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది నెలలుగా ఫెలోషిప్ చెల్లించలేదు - ఇది కూడా విద్యార్థుల్లో అసహనానికి కారణమైంది సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలను నివారించడంలో వైస్ చాన్స్‌లర్ అప్పారావు విఫలమయ్యారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గడచిన నాలుగు మాసాలుగా విశ్వవిద్యాలయంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు వైస్ చాన్స్‌లర్ ప్రయత్నించలేదని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులపాటు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో సంబంధం లేని దాదాపు వంద మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడారు. వైస్ చాన్స్‌లర్‌గా అప్పారావు నియామకానికి ముందు, తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని వీసీకి రాసిన లేఖ కాపీ విశ్వవిద్యాలయం ఇన్వార్డ్ డివిజన్లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. మామూలుగా ఏ వర్సిటీలో అయినా వైస్ చాన్స్‌లర్ ప్రతిరోజూ ఏదో సమయంలో విద్యార్థుల సమస్యలు వినేందుకు కొంత సమయం కేటాయిస్తారు. కానీ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ తనను కలిసేందుకు వ చ్చే విద్యార్థులకు సమయం ఇచ్చేవారు కాదని వీసీ కార్యాలయం సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు. ఒక్క సమస్యను పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు కొత్తవి కాకపోయినా.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించేందుకు కూడా వీసీ చొరవ చూపలేదని ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘విద్యార్థులు మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి విశ్వవిద్యాలయంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడుతున్నా వీసీ చూసీ చూడనట్టు వ్యవహరించారు. విశ్వవిద్యాలయంలో బలంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను చర్చలకు పిలిచి వారి మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడలేదు. విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది కొందరు అక్కడ జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తే అవే సర్దుకుంటాయన్న ధోరణిలో నిర్లక్ష్యం కనబరిచారు’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది. గడచిన సంవత్సరం ఆగస్టు మొదటివారంలో చోటు చేసుకున్న పరిణామాలు చినికిచినికి పెద్దవి కావడానికి వీసీ అలసత్వమే కారణమని పేర్కొంది. బోధనా సిబ్బందితో కమిటీ వేసి విద్యార్థులతో చర్చలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరించింది. కలవాలంటే రెండ్రోజుల ముందు మెయిల్ విద్యార్థులు అప్పుడప్పుడు క్షణికావేశానికి లోనవుతుంటారు. తమ సమస్యను అప్పటికప్పుడు బాధ్యులైన వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ వీసీ.. తనను కలిసేందుకు పెట్టిన ఆంక్షల ఫలితంగా విద్యార్థులతో సమన్వయం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైనా వీసీని కలవాలనుకుంటే.. ఏ కారణాలతో కలువాలనుకుంటున్నారో రెండ్రోజుల ముందుగానే వీసీ కార్యాలయానికి మెయిల్ పెట్టాలి. ఇలా మెయిల్ పెట్టిన విద్యార్థులకు కూడా వీసీ సమయం ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు సైతం వీసీ వైఖరి కారణంగా ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లలేదు. వర్సిటీలో తరచూ ఘర్షణలకు కారణమవుతున్న ఏబీవీపీ, ఏఎస్ఏ (అంబేద్కర్ విద్యార్థి సంఘం) నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. బోధన, బోధనేతర సిబ్బందిలోనూ అసంతృప్తి బోధన సిబ్బంది పట్ల కూడా వీసీ వ్యవహారశైలి బాగా లేకపోవడం విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలకు ఆజ్యం పోసిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. బోధనా సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశంపైనా వీసీ సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వివరించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారని తెలిపింది. ‘‘కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల మధ్య మరింత చిచ్చుపెట్టారు. వారి మధ్య విద్వేషాలు పెరిగేలా చూశారు. బోధన సిబ్బంది సైతం కుల ప్రాతిపదికన విడిపోయారు. ఇన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నా వీసీ దేన్నీ సీరియస్‌గా తీసుకోలేదు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ సహా కొందరు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది మాసాలుగా ఫెలోషిప్ చెల్లించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధుల కొరత లేదు. వారికి ఇవ్వాల్సిన ఫెలోషిప్ ఇవ్వకపోవడం వల్ల కూడా వారిలో అసహనం పెరిగిపోవడానికి కారణమైంది’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది.