ఇది వీసీ వైఫల్యమే
- హెచ్‌సీయూపై కేంద్రానికి నిఘా విభాగం నివేదిక
- వర్సిటీని వీసీ అప్పారావు పూర్తిగా గాలికొదిలేశారు
- నాలుగు నెలలుగా అరాచక పరిస్థితులు నెలకొన్నా పట్టించుకోలేదు.. సమస్యలను పరిష్కరించలేదు
- తనను కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు
- విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి ఘర్షణలకు దిగినా చూసీచూడనట్టు ఉన్నారు... వీసీ నిర్లక్ష్యం వల్లే గతేడాది ఆగస్టులో పరిణామాలు చినికిచినికి పెద్దవయ్యాయి
- ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు.. కొందరు విద్యార్థి సంఘాల మధ్య చిచ్చుపెట్టారు
- రోహిత్ సహా పలువురు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది నెలలుగా ఫెలోషిప్ చెల్లించలేదు
- ఇది కూడా విద్యార్థుల్లో అసహనానికి కారణమైంది
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలను నివారించడంలో వైస్ చాన్స్‌లర్ అప్పారావు విఫలమయ్యారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. గడచిన నాలుగు మాసాలుగా విశ్వవిద్యాలయంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు వైస్ చాన్స్‌లర్ ప్రయత్నించలేదని తెలిపింది. రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐబీ సీనియర్ అధికారి ఒకరు సోమవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. రెండ్రోజులపాటు ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల కార్యకలాపాలతో సంబంధం లేని దాదాపు వంద మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడారు.
వైస్ చాన్స్‌లర్‌గా అప్పారావు నియామకానికి ముందు, తర్వాత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తనపై విధించిన సస్పెన్షన్ రద్దు చేయాలని వీసీకి రాసిన లేఖ కాపీ విశ్వవిద్యాలయం ఇన్‌వార్డ్ డివిజన్‌లో నమోదు చేయని విషయాన్ని గుర్తించారు. మామూలుగా ఏ వర్సిటీలో అయినా వైస్ చాన్స్‌లర్ ప్రతిరోజూ ఏదో సమయంలో విద్యార్థుల సమస్యలు వినేందుకు కొంత సమయం కేటాయిస్తారు. కానీ హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ తనను కలిసేందుకు వ చ్చే విద్యార్థులకు సమయం ఇచ్చేవారు కాదని వీసీ కార్యాలయం సిబ్బంది పూసగుచ్చినట్లు వివరించారు.
ఒక్క సమస్యను పట్టించుకోలేదు
సెంట్రల్ యూనివర్సిటీలో గొడవలు కొత్తవి కాకపోయినా.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించేందుకు కూడా వీసీ చొరవ చూపలేదని ఐబీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘విద్యార్థులు మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి విశ్వవిద్యాలయంలో పలుమార్లు ఘర్షణలకు పాల్పడుతున్నా వీసీ చూసీ చూడనట్టు వ్యవహరించారు. విశ్వవిద్యాలయంలో బలంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను చర్చలకు పిలిచి వారి మధ్య సామరస్య వాతావరణం నెలకొనేలా చూడలేదు. విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది కొందరు అక్కడ జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తే అవే సర్దుకుంటాయన్న ధోరణిలో నిర్లక్ష్యం కనబరిచారు’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది.
గడచిన సంవత్సరం ఆగస్టు మొదటివారంలో చోటు చేసుకున్న పరిణామాలు చినికిచినికి పెద్దవి కావడానికి వీసీ అలసత్వమే కారణమని పేర్కొంది. బోధనా సిబ్బందితో కమిటీ వేసి విద్యార్థులతో చర్చలు జరిపితే పరిష్కారమయ్యే సమస్యల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహించారని వివరించింది.
కలవాలంటే రెండ్రోజుల ముందు మెయిల్
విద్యార్థులు అప్పుడప్పుడు క్షణికావేశానికి లోనవుతుంటారు. తమ సమస్యను అప్పటికప్పుడు బాధ్యులైన వారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తారు. కానీ వీసీ.. తనను కలిసేందుకు పెట్టిన ఆంక్షల ఫలితంగా విద్యార్థులతో సమన్వయం పూర్తిగా లేకుండా పోయింది. ఎవరైనా వీసీని కలవాలనుకుంటే.. ఏ కారణాలతో కలువాలనుకుంటున్నారో రెండ్రోజుల ముందుగానే వీసీ కార్యాలయానికి మెయిల్ పెట్టాలి. ఇలా మెయిల్ పెట్టిన విద్యార్థులకు కూడా వీసీ సమయం ఇవ్వలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అసహనం పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు సైతం వీసీ వైఖరి కారణంగా ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లలేదు. వర్సిటీలో తరచూ ఘర్షణలకు కారణమవుతున్న ఏబీవీపీ, ఏఎస్‌ఏ (అంబేద్కర్ విద్యార్థి సంఘం) నేతలను విశ్వాసంలోకి తీసుకుని వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు.
బోధన, బోధనేతర సిబ్బందిలోనూ అసంతృప్తి
బోధన సిబ్బంది పట్ల కూడా వీసీ వ్యవహారశైలి బాగా లేకపోవడం విశ్వవిద్యాలయంలో అవాంఛనీయ పరిణామాలకు ఆజ్యం పోసిందని ఐబీ తన నివేదికలో పేర్కొంది. బోధనా సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశంపైనా వీసీ సానుకూల దృక్పథంతో వ్యవహరించలేదని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదని వివరించింది. ఈ కారణంగా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారని తెలిపింది.
‘‘కొందరు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాల మధ్య మరింత చిచ్చుపెట్టారు. వారి మధ్య విద్వేషాలు పెరిగేలా చూశారు. బోధన సిబ్బంది సైతం కుల ప్రాతిపదికన విడిపోయారు. ఇన్ని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నా వీసీ దేన్నీ సీరియస్‌గా తీసుకోలేదు. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ సహా కొందరు రీసెర్చ్ స్కాలర్లకు ఏడెనిమిది మాసాలుగా ఫెలోషిప్ చెల్లించకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధుల కొరత లేదు. వారికి ఇవ్వాల్సిన ఫెలోషిప్ ఇవ్వకపోవడం వల్ల కూడా వారిలో అసహనం పెరిగిపోవడానికి కారణమైంది’’ అని ఐబీ తన నివేదికలో వివరించింది.