ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరోగ్య పరిస్థితి గురించి మరో కథనం తెరపైకి వచ్చింది. ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్‌బర్గ్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా హౌజ్‌లలో కథనాలు పబ్లిష్ అయ్యాయి.
దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(NIS) రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(నిద్రలేమి)కు సంబంధించి విదేశీ మెడికల్ ఇన్ఫర్మేషన్‌ను.. ప్రత్యేకించి జోల్పిడెమ్ లాంటి మందులకు సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట.
ఎన్‌ఐఎస్ నివేదిక వివరాలను సౌత్ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ కార్యదర్శి యూ సాంగ్ బూమ్ మీడియాకు వెల్లడించారు. ఇన్సోమ్నియా ఉత్తర కొరియాను కలవరపెడుతోంది. అక్కడి పెద్ద తలకాయ ఆ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం మాకు ఉంది. అంతేకాదు.. దాని ట్రీట్‌మెంట్, మందుల సమాచారం కోసం విదేశీ వైద్యవిధానాల గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారని తేలింది.
వీటితో పాటు తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించిన కొన్ని ఫొటోలను అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మళ్లీ విపరీతంగా బరువు పెరిగినట్లు స్పష్టమైందని బూమ్ తెలిపారు. వీటితో పాటుగా.. విదేశాల నుంచి మల్బరో, డన్‌హిల్ లాంటి విదేశీ బ్రాండ్ సిగరెట్లను, ఆల్కాహాల్‌తో పాటు తినే చిరు తిండ్లను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు.
అతిగా మద్యం, ధూమపానం వల్ల కిమ్ ఆరోగ్యం దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 140 కేజీల బరువునకు ఆయన చేరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్లీపింగ్ డిజార్డర్ ఇన్సోమ్నియా ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే 16వ తేదీన ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్‌లాంటి మందుల్ని సైతం సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది అని సదరు నివేదిక సారాంశాన్ని ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే.. నార్త్ కొరియాలో ఆహార కొరత కారణంగా.. ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు వచ్చిందని, కిమ్ అధికారంలోకి చేపట్టాక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ వస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రజల ఆకలిని పట్టించుకోకుండా.. విలాసాలు, హైప్రొఫైల్ పార్టీలతో కిమ్ కుటుంబం జల్సాలు చేస్తోందన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: నిద్ర లేమి ఎంత ప్రమాదకరమంటే..
Comments
Please login to add a commentAdd a comment