సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 25లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, పూర్తి పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందని, గత ఎన్నికల తరహాలోనే ఈసారీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వివరించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,170 పంచాయతీలను, షెడ్యూల్ ఏరియాలోని 1,300 గ్రామ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వు చేసినట్లు తెలిపారు. ప్రతి కేటగిరీలోనూ 50 శాతం పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయన్నారు. గ్రామం యూనిట్‌గా వార్డ్ మెంబర్‌కు, మండలం యూనిట్‌గా సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులకు మూడు నెలలపాటు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
మహిళా సంఘాలకు ట్యాబ్‌లు..
గ్రామ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీలను అందజేస్తున్నామని జూపల్లి తెలిపారు. స్త్రీనిధి బ్యాంకు ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంఘాలకు మంత్రి గురువారం ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తున్నామని, ట్యాబ్లెట్ పీసీలతో రుణాల కోసం గ్రామం నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ఆధార్, ఐరిస్ ధ్రువీకరణ సౌకర్యం సైతం ట్యాబ్లెట్ సీపీల్లో పొందుపరచవచ్చన్నారు. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం విలేజ్ ఆర్గనైజేషన్ల(వీవో) ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నర్సరీలపై సదస్సులు
కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీని కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జూపల్లి తెలిపారు. నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, సంరక్షణ లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు జూన్ 25 నుంచి జూలై 10 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాథమిక గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన కనీసం 20 వేల నుంచి లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment