ఇంకెన్నాళ్లు...ఎదురుచూపులు! | No Compensation For Villages Behind Srisailam Project | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు...ఎదురుచూపులు!

Published Fri, Mar 8 2019 3:34 PM | Last Updated on Fri, Mar 8 2019 3:36 PM

No Compensation For Villages Behind Srisailam Project  - Sakshi

ముంపునకు గురైన మంచాలకట్ట గ్రామం 

సాక్షి, పెంట్లవెల్లి(నాగర్‌కర్నూలు) : శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో ఏటి ఒడ్డున ఉన్న ఎన్నో గ్రామాలు 38ఏళ్ల క్రితం ముంపునకు గురయ్యాయి. అందులో ఎన్నో గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, కల్లందొడ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వారికి ప్రత్యేక జీఓ ఏర్పాటు చేస్తున్నామని 98 జీఓను గతంలో ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి సవరించిన జీఓను అమలు పర్చలేకపోయారు. కొంతమందికి మాత్రమే అందులో ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇటు ఉద్యోగాలు రాక.. సరైన నష్టపరిహారం రాక ముంపు బాధితులు జీవనోపాధి కోసం గోడు వెల్లబోసుకుంటున్నారు.


మంత్రి, కలెక్టర్ల చర్యలు నిష్ఫలం 
వనపర్తి, కొల్లాపూర్, చిన్నంబావి ఏరియాల్లో 2500 వరకు ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏటా ఎన్నికల ముందు వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ హామీలిస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా గతంలో ఉద్యోగాలిస్తామని మాటలు చెప్పారు.. కానీ ఇంతవరకు శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వారికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశామని, ఏ ఒక్కరూ దీనిపై చర్చలు జరపలేదని వాపోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గత కలెక్టర్లు చర్చలు చేసినా.. ఏమీ తేల్చలేకపోయారు.


పాదయాత్ర చేపట్టినా ఫలితం శూన్యం 
జటప్రోల్, మాధవస్వామినగర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎంగంపల్లిలో దాదాపుగా 250 మంది 98 జీఓ నిర్వాసితులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక, అటు నష్టపరిహారం లేక భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు, లేనివారికి రూ.10లక్షలు ఇవ్వాలని గతంలో అలంపూర్‌ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టినా.. ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.


ఎమ్మెల్యే హామీ ఫలించేనా? 
ఈసారి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ఖచ్చితంగా 98 జీఓ నిర్వాసితులకు ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారని, ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నామని పేర్కొంటున్నారు. భూములు నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయా గ్రామాల 98 జీఓ నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఏటి ఒడ్డున ఉన్న ప్రాంతాల వారందరూ జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈసారైనా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.


ఈసారైనా ఉద్యోగాలివ్వండి 
38ఏళ్ల నుంచి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నా ఇంతవరకు మా కల నెరవేరడంలేదు. సర్వం కోల్పోయిన మాకు ఉద్యోగాలే దిక్కని అనుకున్నాం. ఇప్పటికైనా అవకాశం కల్పించాలి. 
– ఖాజామైనోద్దీన్, 98 జీఓ జిల్లా అధ్యక్షుడు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement