అచ్చంపేటలో ఘర్షణ పడుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారం అర్ధరాత్రి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నియోజకవర్గ సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు చెందిన వాహనంలో డబ్బులు వస్తున్నాయని ఆరోపించిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. శనివారం రాత్రి ఉప్పునుంతల మండలం వవెల్టూరు నుంచి వాహనాన్ని వెంబడిస్తూ అచ్చంపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు అడ్డుకున్నారు.
వాహనంలోని బ్యాగులను తెరిచేందుకు ప్రయత్నించగా.. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గువ్వల బాలరాజుతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇరువురు ఎదురుపడి చూసుకుందామంటే.. చూసుకుందామంటూ మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం ఇంటికి వెళ్లిన గువ్వల బాలరాజు భోజనం చేస్తుంటే నోరు తెరిచేందుకు రావడం లేదని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఆక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు.
అధికారులు పట్టించుకోలేదా?
అధికార పార్టీకి చెందిన రెండు వాహనాలతో పాటు ఓ పోలీస్ వాహనం అనుమానాస్పదంగా తిరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే తాము వాహనం వెంబడించాల్సి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా సరిహద్దు నుంచి అచ్చంపేటకు బీఆర్‌ఎస్ అభ్యర్థికి డబ్బులు అందుతున్నాయని, ఇందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు.
పరస్పరం ఫిర్యాదులు
ఇదిలా ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తలు అర్ధరాత్రి వంశీకృష్ణ, గువ్వల బాలరాజులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వేర్వేరుగా అంబేద్కర్ చౌరస్తా, పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల నియమావళి ఉండటంతో ధర్నాలు చేయడం సమంజసం కాదని పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
అపోలో ఆస్పత్రిలో చేరిన గువ్వల బాలరాజును ఆదివారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ పోతుగంటి రాములు పరామర్శించారు. చికిత్స అనంతరం సాయంత్రం గువ్వల ఆస్పత్రి నుంచి అచ్చంపేటలోని ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాల వారు సోషల్ మీడియాలో తమకు నచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ఓటమి భయంతోనే గువ్వల బాలరాజు దెబ్బలు తగిలినట్లు కొత్త నాటకం మొదలుపెట్టారని వంశీకృష్ణ ఆరోపిస్తుండగా.. రాజకీయంగా తనను ఎదురుకోలేక సహనం కోల్పోయి వంశీకృష్ణ రాళ్లతో దాడికి పాల్పడ్డారని గువ్వల బాలరాజు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట సంఘటనపై మీ సినిమా రికార్డు అయ్యిందని పోలీసులు అన్న మాటలపై ఎన్నికల కమిషన్‌కు పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ చెప్పారు.
ఇవి చదవండి: వాదం.. ఎవరికి ఆమోదం! సీడ్ మాఫియాతో చీకటి ఒప్పందం..
Comments
Please login to add a commentAdd a comment