మహబూబ్‌నగర్: పాలమూరులో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. మొదట్లో ముఖ్య నేతల చేరికలతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొనగా.. అభ్యర్థుల ఖరారు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతుండగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.
జడ్చర్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం హస్తంను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరగా.. నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సైతం కారెక్కేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ సైతం ఆ పార్టీకి జలక్ ఇచ్చి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో మారుతున్న పరిణామాలు పొలిటికల్ హీట్‌ను పెంచుతుండగా.. బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.
ఆయా నియోజకవర్గాలపై ప్రభావం..
సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాపై మంచి పట్టు ఉంది. పలు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవమున్న ఆయన బీఆర్‌ఎస్‌లో చేరనుండడంతో నాగర్‌కర్నూల్‌తోపాటు కొల్లాపూర్, వనపర్తి సెగ్మెంట్లలో గులాబీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా ఎర్రశేఖర్ కారెక్కిన నేపథ్యంలో జడ్చర్లతోపాటు నారాయణపేటలో బీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరనున్నట్లు తెలుస్తోంది. పి.చంద్రశేఖర్ గులాబీ చెంతకు చేరడంతో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గెలుపు సునాయాసమైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రేవంత్ ఇలాకాపై బీఆర్‌ఎస్ స్పెషల్ స్కెచ్..
పి.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మేలు చేసే అంశంగా భావిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు సుమారు 55 వేల వరకు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో వారిదే ఆధిక్యత. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కీలక నేతలు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
కాగా, మహబూబ్‌నగర్, దేవరకద్రలో కాంగ్రెస్ టికెట్ల ఖరారు తర్వాత అసమ్మతి రాజుకుంది. పునరాలోచించాలని.. రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించాలని ఆశావహులు ఆ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. స్పందించని పక్షంలో ఆ నియోజకవర్గాలకు చెందిన కొందరు నాయకులు సైతం బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
‘గులాబీ’ చెంతకు ఎర్ర శేఖర్..
జడ్చర్ల లేదా నారాయణపేట నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి, భంగపాటుకు గురైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అలియాస్ ఎం.చంద్రశేఖర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వెంట నారాయణపేట జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఉన్నారు.
మాజీమంత్రి పి.చంద్రశేఖర్ సైతం..
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.
ఆ వెంటనే రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్‌తో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పి.చంద్రశేఖర్ 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. 1989, 2004 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల క్రమంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొంతకాలం తర్వాత బీజేపీలో చేరిన ఆయన తాజాగా మళ్లీ గులాబీ చెంతకు చేరారు.
సీఎం కేసీఆర్‌తో నాగం భేటీ..
నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాదని.. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికి కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడికి లేఖ రాశారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లోని నాగం జనార్దన్‌రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేరుకుని మంతనాలు జరిపారు. అనంతరం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నాగం ఇంటికి చేరుకుని.. బీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ భవిష్యత్ కోసం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించిన ఆయన.. రాత్రి సీఎం కేసీఆర్‌ను సైతం కలిశారు.
పార్టీలో సముచిత స్థానంతోపాటు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో త్వరలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
డాక్టర్‌గా సేవలందిస్తూ 1983లో టీడీపీలో చేరిన నాగం ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇందులో ఆరు దఫాలు (1985, 1994, 1999, 2004, 2009, 2012)లో గెలుపొందారు. 1995లో చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత 1999లో కూడా టీడీపీఅధికారంలోకి రాగా..మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment